
డెయిరీ ఆధునికీకరణకు ప్రాధాన్యత
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మంలోని పాడి పరిశ్రమ ఆధునికీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని పాడి పరిశ్రమ కార్యాలయం, యూనిట్‌ను మంగళవారం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర పాడి పరిశ్రమ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 50ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాడి పరిశ్రమను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందన్నారు. డెయిరీలో సోలార్ యూనిట్ ఏర్పాటుతో విద్యుత్ బిల్లుల భారం తగ్గగా, కేఎంసీ నుంచి నీటి సరఫరాకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే, డ్రెయిన్ల మళ్లింపు, ప్రహరీ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. అంతేకాక జిల్లాలో విజయ డెయిరీ చిల్లింగ్ యూనిట్ల ఆధునికీకరణకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ విజయ డెయిరీలో సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఖమ్మం ఆర్‌డీఓ నర్సింహారావు, డెయిరీ డీడీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.