
ఫీజు కట్టినా తిప్పలే..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్(లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తులకు పరిష్కారం లభించడం లేదు. ఐదేళ్లుగా స్థలంపై యాజమాన్య హక్కుల కోసం దరఖాస్తుదారులు పడరాని పాట్లు పడుతున్నారు. అన్ని అడ్డంకులను దాటుకుని ఫీజు చెల్లించినా ప్రొసీడింగ్స్ జారీ కాక దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
రెగ్యులరైజ్ కోసం..
గతంలో చాలామంది అనుమతి లేకుండానే లేఔట్లు చేసి వెంచర్లు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలి యక పలువురు స్థలాలు కొనుగోలు చేయగా... యజమానులకు ఊరట లభించేలా స్థలాల రెగ్యులరైజ్‌కు అప్పటి ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. 2020కి ముందు పలుమార్లు దరఖాస్తులు ఆహ్వానించినా మార్గదర్శకాలు విడుదల చేయలేదు. 2020లో మున్సిపల్ శాఖ 131 జీఓ విడుదల చేస్తూ ఆ ఏడాది ఆగస్ట్ 26కు ముందే స్థలాలు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమాన ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీల్లో ప్లాట్ల క్రమబద్ధీకరణకు రూ.వెయ్యి చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు.
మూడు దశల్లో పరిశీలన
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఎల్–1లో అర్బన్ ఏరియాలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్లు, ఆఫీసర్లు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి. టౌన్ ప్లానింగ్ సిబ్బంది అనుమతులు, రెవెన్యూ అధికా రులు స్థలం వివరాలను పరిశీలించగా, నీటిపారుదల శాఖ అధికారులు శిఖం భూముల్లో ఉన్నాయా అనేది చూడాలి. ఆపై ఎల్–2లో టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ కంటే ఉన్నత స్థాయి ఉద్యోగి పరిశీలించి దరఖాస్తుకు జత చేసిన పత్రాలన్నీ సరిగ్గా ఉన్నాయా, లేదా అని ఆరా తీయాలి. ఒకవేళ ప్లాట్‌లో ఇల్లు కడితే సంబంధిత పట్టా చేయకపోతే వాటిని అందజేయాలని సమాచారం ఇస్తారు. ఈ దశ తర్వాత ఎల్–3కి పంపుతారు. అర్బన్ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ దరఖాస్తులు, పత్రాలను మరోమారు పరిశీలించి నిర్దేశిత నగదును చలానాగా కట్టాలని దరఖాస్తుదారులకు సూచిస్తారు.
రూ.102 కోట్ల ఆదాయం
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపుల ద్వారా ప్రభుత్వానికి రూ.102.72 కోట్ల ఆదాయం లభించింది. ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులా పురం మున్సిపాలిటీలు, సుడా, గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 1,00,453దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 80,577 దరఖాస్తులు ఫీజు చెల్లింపునకు అర్హత సాధించినట్లు నిర్ధారించి స్థల యజ మానులకు సమాచారం ఇచ్చారు. ఆపై ప్రభుత్వం 25శాతం రాయితీ ప్రకటించగా 26,790 మంది ఇప్పటివరకు ఫీజులు చెల్లించారు.
నత్తనడకన ప్రక్రియ
దరఖాస్తు చేసుకున్న స్థల యజమానులకు ప్రొసీడింగ్స్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత ఐదేళ్లుగా ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తుండగా.. చివరి దశలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫీజు చెల్లించాలని సమాచారం అందగానే దరఖాస్తుదారులు చలానా కడితే దరఖాస్తులను మరోసారి పరిశీలించి రెగ్యులరైజ్ చేస్తారు. ఇదంతా పది రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. కానీ నెలలు గడుస్తున్నా దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్ అందడం లేదు. జిల్లాలో మొత్తంగా 26,790 మంది ఫీజు చెల్లిస్తే కేవలం 8,401 మందికే ప్రొసీడింగ్స్ జారీ కావడం గమనార్హం. అయితే, ఫీజు చెల్లించాక దరఖాస్తులను మరోసారి పరిశీలించాల్సి వస్తుండడంతో సిబ్బంది కొరత కారణంగా కొంత ఆలస్యమవుతోందని అధికారికవర్గాలు చెబుతున్నాయి.
మోక్షం లేని ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు
యాజమాన్య హక్కుల కోసం ఐదేళ్లుగా ఎదురుచూపులు
26,790 మంది ఫీజు చెల్లిస్తే 8,401 మందికే ప్రొసీడింగ్స్
జిల్లాలో ఎల్‌ఆర్‌ఆర్ దరఖాస్తుల స్థితిగతులు...
సంస్థ దరఖాస్తులు ఫీజు ప్రొసీడింగ్స్
చెల్లించింది జారీ అయినవి
ఖమ్మం కార్పొరేషన్ 40,165 12,502 3,995
సత్తుపల్లి మున్సిపాలిటీ 3,695 654 559
మధిర 4,306 1,092 845
ఏదులాపురం 13,629 3,731 761
వైరా 3,535 728 460
సుడా 20,745 6,003 1,551
గ్రామపంచాయతీలు 14,378 2,080 230
మొత్తం 1,00,453 26790 8,401