
సమన్వయంతో ప్రభుత్వ లక్ష్యాల సాధన
● భూసమస్యల పరిష్కారానికి ప్రణాళిక ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సీఎస్ కె.రామకృష్ణారావు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం కలెక్టర్లతో సమీక్షించారు. ఖమ్మం నుంచి కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి పాల్గొనగా.. వీసీ అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. కామేపల్లి, సింగరేణి మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఏర్పడితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో చర్చించాలని సూచించారు. అలాగే, సత్తుపల్లి మండలానికి ముల్కలపల్లి నుంచి ఇసుక రవాణా చేయించాలని తెలిపారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ జరగకుండా మండల ప్రత్యేక అధికారులు భోజనం నాణ్యతను తనిఖీ చేయాలని చెప్పారు. అలాగే, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ, వనమహోత్సవం విజయవంతానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, వివిధ శాఖల జిల్లా అధికారులు సన్యాసయ్య, ఆశాలత, కళావతిబాయి, శ్రీనివాస్, జి.జ్యోతి, శ్రీలత, కె.రాంగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
రఘునాథపాలెం: విద్యార్థులు గొప్ప స్థాయికి ఎదగాలంటే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. రఘునాథపాలెం మండలంలోని వి.వెంకటాయపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆతర్వాత విద్యార్థులతో మాట్లాడి వారి లక్ష్యాలను తెలుసుకున్నాక గణిత పాఠం బోధిస్తూ ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. సైకిల్ నేర్చుకునేటప్పుడు పడడం ఎంత సాధారణమో చదువులోనూ అలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమించాలని సూచించారు. ఆతర్వాత మరుగుదొడ్లు, బీసీ హాస్టల్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. డీఈఓ ఎస్.సత్యనారాయణ, హెచ్‌ఎం శ్రీమన్నారాయణ, మార్కెట్ చైర్మన్ హనుమంతరావు పాల్గొన్నారు.