
పాడి సంఘాల బలోపేతానికి ఎన్నికలు
తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి
ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వ పాడి పరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తిదారుల సంక్షేమం దృష్ట్యా పాడి సహకార సంఘాల బలోపేతానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య లిమిటెడ్(విజయ డెయిరీ) మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఖమ్మంలోని విజయ డెయిరీని మంగళవారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడారు. పాడి పరిశ్రమకు రాష్ట్రంలో 1,500 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఉండగా, ఎన్ని కలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సంస్థకు పాలు పోసే రైతులు 2లక్షల మంది ఉండగా, సహకార సంఘాల్లో అర్హులను సభ్యులుగా చేర్చాక 3 – 4 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
4.50లక్షల నుంచి 5.50లక్షల లీటర్లకు..
విజయ డెయిరీ ప్రస్తుతం లాభనష్టాలు లేని స్థితిలో కొనసాగుతోందని ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నిత్యం 4.50 లక్షల లీటర్ల పాలు సేకరిస్తుండగా, దీన్ని 5.50 లక్షల లీటర్లకు పెంచేలా కృషి జరుగుతోందన్నారు. విజయ పాలు, పాల ఉత్పత్తులకు ఆదరణ ఉన్నందున ప్రభు త్వ విద్యాసంస్థలు, ఆస్పత్రులకు సరఫరా చేస్తూనే జనరల్ మార్కెట్‌లోనూ విక్రయాల పెంపునకు ప్రణాళిక రూపొందించామని వివరించారు. ఇందులో భాగంగా మహిళా సంఘాల ద్వారా రాష్ట్రంలో వెయ్యి పార్లర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, లీటర్‌కు రూ.4 చొప్పున ఇచ్చే ప్రోత్సాహకాలు సుమారు రూ.15 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఖమ్మం విజయ డెయిరీలో ప్రస్తుతం ఉన్న యంత్రాల స్థానంలో కొత్తవి అమర్చడంతో పాటు ఇతర మార్పుల కోసం రూ.2.30 కోట్లు వెచ్చించనున్నట్లు ఎండీ వెల్లడించారు. ఇటీవల వరంగల్ డెయిరీకి సంబంధించిన పాలను ఖమ్మంలో విక్రయించినట్లు తేలిందని, మరోమారు ఇలా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే, షాపింగ్ కాంప్లెక్స్‌ను అద్దెకు ఇచ్చేందుకు వారంలో టెండర్లు నిర్వహిస్తామని ఎండీ పేర్కొన్నారు.