
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
అందుబాటులో టోల్‌ఫ్రీ నంబర్ 1077
ఖమ్మంసహకారనగర్: భారీ వర్షాల నేపథ్యాన కలెక్టరేట్‌లో 1077 టోల్ ఫ్రీ నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి పర్యవేక్షణలో ఈ కంట్రోల్ రూమ్‌లో 24గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని వెల్లడించారు. వరదలు, ఇతర విపత్తుల నేపథ్యాన ఎలాంటి సహకారం అవసరమైనా, ఆపదలో చిక్కుకున్న వారైనా 1077 నంబర్‌కు ఫోన్ చేయొచ్చని కలెక్టర్ సూచించారు.
ఉద్యోగాల పేరిట ప్రచారాన్ని నమ్మకండి
ఖమ్మంవైద్యవిభాగం: ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు చేస్తున్న ప్రచారాన్ని నిరుద్యోగులు నమ్మొద్దని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, ఆస్పత్రుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు నగదు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయడం లేదనే విషయాన్ని గుర్తించి నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏవైనా ఉద్యోగ నియామకాలు అవసరమైతే కలెక్టర్ అనుమతితో నోటిఫికేషన్ ఇస్తామని డీఎంహెచ్‌ఓ తెలిపారు.
ఎంత భూమి ఉన్నా
యూరియా 4 బస్తాలే...
కొణిజర్ల: రైతులు అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. మండలంలోని తనికెళ్లలో ఫెర్టిలైజర్ దుకాణాలను మంగళవారం తనిఖీ చేసిన ఆయన స్టాక్ వివరాలపై ఆరా తీశారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ ఎంత భూమి ఉన్న రైతులకై నా నాలుగు బస్తాలకు మించి యూరియా ఇవ్వొద్దని యజమానులకు సూచించారు. అలాగే, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుంటూ మండల రైతులకే అందించాలని తెలిపారు. కొందరు అదనంగా యూరియా తీసుకెళ్లి పాల తయారీ, చేపల చెరువుల అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రైతులు కూడా మోతాదుకు మించి యూరియా వాడకుండా నానో యూరియా వినియోగంపై దృష్టి సారించాలని డీఏఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ డి.బాలాజీ పాల్గొన్నారు.
డ్రైవింగ్‌లో మెళకువలతో సురక్షిత ప్రయాణం
ఖమ్మం మామిళ్లగూడెం: ఆర్టీసీ డ్రైవర్లు ఎప్పటికప్పుడు విధుల్లో మెళకువలు పెంపొందించుకోవడం ద్వారా ప్రమాదాల సంఖ్య తగ్గడమే కాక ప్రయాణికుల మన్ననలు పొందొచ్చని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. ఇటీవల వివిధ చోట్ల ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లకు రెండు రోజుల పాటు ఇవ్వనున్న శిక్షణను ఖమ్మం కొత్త బస్టాండ్‌లో మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సాంకేతిక అంశాలపై పట్టు పెంచుకోవడం, డ్రైవింగ్‌లో మెళకువలపై అవగాహన సాధించడం ద్వారా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చవచ్చని తెలిపారు. అనంతరం ఏసీపీ శ్రీనివాసులు, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్