ద్రవం.. మెరుగైన ఫలితం! | - | Sakshi
Sakshi News home page

ద్రవం.. మెరుగైన ఫలితం!

Jul 17 2025 8:46 AM | Updated on Jul 17 2025 8:46 AM

ద్రవం

ద్రవం.. మెరుగైన ఫలితం!

నానో యూరియాతో లాభాలెన్నో...
● గుళికల యూరియా కొరత నేపథ్యాన విస్తృత ప్రచారం ● వాడకానికి ముందుకొస్తున్న రైతులు

ఎర్రుపాలెం/నేలకొండపల్లి: పంటల సాగు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. అయితే, పంటల్లో దశల వారీగా ఉపయోగించే యూరియా కొరత రైతులను వేధిస్తోంది. అవసరానికి సరిపడా కోటా రాకపోవడం, వచ్చినా కొన్నిచోట్ల డీలర్లు మాయాజాలం ప్రదర్శిస్తుండడం.. ఇంకొన్ని చోట్ల భవిష్యత్‌లో కొరత వస్తుందని రైతులు ముందుగా కొనుగోలుకు సిద్ధమవుతుండడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ సమయాన అధికారులు గుళికల యూరియాకు బదులు నానో(ద్రవరూపం) యూరియా వాడకంతో లాభాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఖర్చు తగ్గడమే కాక ఫలితం బాగుంటుందని, రవాణా సులువవుతుందని చెబుతూ అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే రైతులు నానో యూరియా వాడకానికి ముందుకొస్తున్నారు. అయితే, అధికారులు మరింత విస్తృత ప్రచారం చేస్తే పెద్దసంఖ్యలో రైతులు ముందుకొచ్చే అవకాశముంది.

ఏమిటీ నానో?

నానో యూరియా ఒక్క బాటిల్‌(500 మి.లీ) వినియోగిస్తే 45 కేజీల బస్తా గుళికల యూరియాతో సమానమని చెబుతున్నారు. 45 కిలోల యూరియా బస్తా ధర రూ.270 కాగా, అర లీటర్‌ నానో యూరియా రూ.225కే లభిస్తుంది. నత్రజనిని అందించే ఈ ఎరువు ద్వారా మొక్కల్లో పచ్చదనం, చురుకై న పెరుగుదల నమోదవుతుందని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పంటలకు నత్రజనిని అందించేలా రైతులు గుళికల యూరియాను 2–3 సార్లు పైపాటుగా వేస్తున్నారు. ఇందులో నత్రజనిని కేవలం 30–50 శాతం మాత్రమే పంట వినియోగించుకుంటోంది. మిగతాదంతా వృథా కావడం లేదా నేల, గాలి, నీటిని కలుషితం చేస్తోంది. అదే నానో ఎరువు వాడకంతో ఇలాంటివేవీ జరగవు.

పంటలకు ఉపయోగం

నానో యూరియా కణాలు చిన్నవిగా ఉండడంతో పంటకు 80 శాతం కన్నా ఎక్కువగా చేరుతుంది. మొక్కలకు నత్రజని అవసరాన్ని సమర్థవంతంగా తీరుస్తూ ఆకుల్లో కిరణజన్య సంయోగక్రియను పెంచడం, వేర్లలో కణజాలం వృద్ధికి ఉపయోగపడుతుంది. సంప్రదాయ యూరియాతో పోలిస్తే 50 శాతం, అంతకంటే తక్కువే అవసరమవుతుండడంతో రైతులకు ఖర్చు తగ్గుతుంది. అంతేకాక గుళికల యూరియా బస్తాల రవాణా భారం తగ్గుతుందని, నానో యూరియా 500 మి.లీ నానో యూరియా బాటిల్‌ను సులభంగా ఎక్కడికై నా తీసుకెళ్లవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. ఇది లీటర్‌ నీటికి 2–4 మి.లీ. కలిపి పంట చురుకై న ఎదుగుదల దశలో ఆకులపై పిచికారీ చేయాలి. ఎకరాకు ఒక లీటర్‌ నానో యూరియా సరిపోనుండగా, పంట వేసిన 20–25 రోజుల్లో ఓసారి, 20–25 రోజుల తర్వాత మరోమారు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ యూరియా ద్రవరూపంలో ఉండడంతో ఆకులపై పిచికారీ చేసినప్పుడు రంధ్రాల ద్వారా సులభంగా లోనకు వెళ్తూ మొక్క అన్ని భాగాలకు పంపిణీ అవుతుంది. అవసరం మేరకు మొక్కలు పీల్చుకున్నాక మిగతాది మొక్కల ఇతర భాగాల్లో నిల్వ చేయబడి అవసరమైనప్పుడు విడుదలవుతుంటుంది.

పంట చేన్లలో చూపించాలి..

ఇన్నాళ్లు పంటలకు గుళికల రూపంలో ఉన్న యూరియా వాడుతున్నాం. కానీ ఈసారి ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా వచ్చిందని చెబుతున్నారు. పంటలకు ఇది ఎలా ఉపయోగపడుతుందో రైతులకు పంట చేన్ల వద్ద వివరిస్తే

అర్థమవుతుంది. – మేకల ఆర్జున్‌,

కోనాయిగూడెం, నేలకొండపల్లి మండలం

మొక్కలకు బాగా పని చేస్తోంది..

ప్రస్తుతం పత్తి, పసుపు సాగు చేస్తున్నా. అధికారుల సూచనలతో నానో ఎరువు వాడుతుండగా పంట ఎదుగుదలకు బాగా పనిచేస్తోందని గుర్తించాం. చేన్లలోకి తీసుకెళ్లడం సులువైంది. యూరియా కొరత సమయాన నానో రావడం ఆనందంగా ఉంది. – అంబటి వెంకటేశ్వరరెడ్డి,

నారాయణపురం, ఎర్రుపాలెం మండలం

పర్యావరణానికి మేలు..

నానో(ద్రవ) యూరియా వాడకంతో భూగర్భ జలాల్లోకి నత్రజని చేరడం తగ్గుతుంది. తద్వారా నేల ఆరోగ్యమే కాక పంటల నాణ్యత పెరుగుతుంది. పంట దిగుబడి సైతం ఎనిమిది శాతం మేర పెరుగుతుంది. నానో యూరియా అన్ని ఎరువుల షాప్‌ల్లో లభిస్తుంది.

– పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి

ద్రవం.. మెరుగైన ఫలితం!1
1/4

ద్రవం.. మెరుగైన ఫలితం!

ద్రవం.. మెరుగైన ఫలితం!2
2/4

ద్రవం.. మెరుగైన ఫలితం!

ద్రవం.. మెరుగైన ఫలితం!3
3/4

ద్రవం.. మెరుగైన ఫలితం!

ద్రవం.. మెరుగైన ఫలితం!4
4/4

ద్రవం.. మెరుగైన ఫలితం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement