
విద్యార్థులకు నాణ్యమైన విద్యే లక్ష్యం
● తొలిదశగా మధిర నియోజకవర్గంలో 11 స్కూళ్ల అభివృద్ధి ● తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ మురళి
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సూచించారు. కలెక్టరేట్‌లోబుధవారం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి మధిర నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న 11 పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా అంతా కృషి చేయాలని తెలిపారు. ప్రతీ మండలంలో అంతర్జాతీయ స్థాయి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు పారంభించాలని కమిషనర్ తరపున సిఫారసు చేసినట్లు చెప్పారు. ఈమేరకు మధిర నియోజకవర్గంలో 11 పాఠశాలలను గుర్తించగా, రెండు కేటగిరీలుగా విభజించినట్లు తెలిపారు. కేటగిరీ–1లోని రెండు పాఠశాలల్లో 1,000 – 1,200 మంది విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్‌లు, క్రీడామైదానం, కిచెన్, డైనింగ్ హాల్ నిర్మించాలని సూచించారు. ఈ పనులన్నీ స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ద్వారా చేపట్టాలని, ఈ కమిటీల్లో కేవలం తల్లిదండ్రులు 30 మందిని నియమించి సగం మేర మహిళలకు అవకాశం కల్పించాలని చెప్పారు. పీఎం శ్రీ, సమగ్ర శిక్షా అభియాన్, ఉపాధి హామీ నిధులను వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చైర్మన్ సూచించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడగా డీఈఓ ఎస్.సత్యనారాయణ, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, విద్యాశాఖ ఈఈ విన్సెంట్‌రావు, ఎంఈఓలు, ఈఈ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.