
కొరవడిన పర్యవేక్షణ
● బీసీ సంక్షేమ శాఖ హాస్టళ్లలో సమస్యల తిష్ట ● అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థుల అవస్థలు
ఖమ్మంమయూరిసెంటర్: పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన వసతి, భోజనంతో కూడిన విద్యనందించేందుకు ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలను నిర్వహిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది తీరుతో ప్రభుత్వ లక్ష్యానికి గండి పడుతుందనే విమర్శలు వస్తున్నాయి. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యాన నడుస్తున్న వసతి గృహాలను పర్యవేక్షించాల్సిన డివిజన్ స్థాయి అధికారులు జిల్లా కేంద్రం దాటకపోవడంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జిల్లాలో మొత్తం 20 బీసీ ప్రీమెట్రిక్ వసతిగృహాలు ఉండగా 1,521 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు.
కనీస సౌకర్యాల కరువు
వసతిగృహాల్లో తగినన్ని మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోగా శుభ్రమైన తాగునీరు, పౌష్టికాహారం, దుప్పట్లు కూడా అందడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. దీంతో పాతబడిన భవనాలు, సరిపోని వెంటిలేషన్, విద్యుత్ సమస్యల నడుమే కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ప్రధానంగా వర్షాకాలంలో దోమల బెడద వేధిస్తోందని, అనారోగ్యం బారిన పడిన వారికి సరైన చికిత్స కూడా చేయించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఏడాది వసతి గృహాల్లో మెరుగైన స్థాయిలో ప్రవేశాలు నమోదు కాలేదని, ఖమ్మం డివిజన్ పరిధి ముదిగొండ వసతిగృహంలో 23 మందే చేరడంపై విమర్శలు వస్తున్నాయి.
పర్యవేక్షణ లోపంతో..
వసతిగృహాలను పర్యవేక్షించాల్సిన డివిజన్ స్థాయి అధికారులు జిల్లా కార్యాలయంలోనే ఉంటూ క్షేత్రస్థాయికి వెళ్లడం లేదనే విమర్శలున్నాయి. క్షేత్రస్థాయి పర్యటనలు చేయకపోవడంతో వసతిగృహాల్లో సమస్యలను గుర్తించలేక పరిష్కారం కావడం లేదు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి తరచుగా వసతిగృహాలను తనిఖీ చేస్తున్నా, డివిజనల్ అధికారులు తమ పని కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే అపవాదు ఉంది.
అరకొర వసతుల నడుమే..
ఖమ్మం ముస్తఫానగర్‌లోని బీసీ బాలుర ‘ఏ’హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరగా, కొత్త భవనానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిధులు కేటాయించారు. దీంతో పాత భవనాన్ని తొలగించినప్పుడు విద్యార్థులకు సరిపడా సౌకర్యాలు ఉన్న భవనాన్ని ఎంపిక చేయాల్సింది పోయి 26వ డివిజన్‌లోని మున్సిపాలిటీ కమ్యూనిటీ హాల్‌ను వసతిగృహంగా మార్చారు. ఇందులో 68 మంది విద్యార్థులు ఉన్నట్లు చెబుతున్నా.. 40 – 50 మంది దాటడం లేదని సమాచారం. ఇక వంటగది, స్టోర్ రూమ్, విద్యార్థుల బసకు వేర్వేరు గదులు లేకపోవడంతో హాల్‌లోలనే వంట చేయడం, అక్కడే భోజనం వడ్డించడం, ఆ తర్వాత పడుకోవాల్సి రావడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇక టాయిలెట్లు కూడా నాలుగే ఉండడంతో విద్యార్థులు పలువురు ఇంటిబాట పట్టినట్లు సమాచారం. ఈ అంశంపై ఖమ్మం డివిజనల్ అధికారి ఈదయ్యను వివరణ కోరగా కమ్యూనిటీ హాల్‌లో గదుల నిర్మాణానికి మున్సిపల్ అధికారులకు లేఖ రాశామని తెలిపారు. అలాగే, ముదిగొండ వసతిగృహం ప్రైవేట్ భవనంలో ఉండడంతో విద్యార్థులు చేరలేదని వెల్లడించారు.