
పంటలకు ప్రాణం.. రైతుల్లో హర్షం
పెనబల్లి/కల్లూరురూరల్: ఖరీఫ్ సీజన్‌లో సాగవుతున్న వరి పంట వర్షాభావ పరిస్థితులతో ఎండిపోయే దశకు చేరగా.. సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు విడుదల చేయడంతో పంటలకు ప్రాణం పోసినట్లయింది. వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు నాట్లు వేయగా వరుణుడు ముఖం చాటేశాడు. మరోపక్క సాగర్ జలాల విడుదలలో జాప్యం జరుగుతుండగా, ఇంతలోనే సీతారామ ద్వారా గోదావరి జలాలు విడుదలయ్యాయి. ఏన్కూరు వద్ద లింక్ కెనాల్ మీదుగా కల్లూరు డివిజన్‌లోని మధిర బ్రాంచ్ కెనాల్ పుణ్యపురం మేజర్, మైనర్ కాల్వలకు చేరుతోంది. అలాగే, పెనుబల్లి, వేంసూరు మండలాలకు ప్రధాన కాల్వ ద్వారా నీరు సరఫరా చేస్తుండగా బుధవారం సాయంత్రానికి సాగర్ 80వ కి.మీ. వరకు నీరు చేరింది. గురువారం ఉదయం 101 కి.మీ. మధిర మేజర్ వరకు నీరు చేరే అవకాశముందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా పెనుబల్లి మండలం కారాయిగూడెంలో సాగర్ కాల్వ వద్ద రైతులు సంబురాలు జరుపుకున్నారు.