
‘ప్రభుత్వాల విధానాలతో కార్మికుల శ్రమ దోపిడీ’
ఖమ్మంమయూరిసెంటర్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించడమే కాక పాలకులు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలతో కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎల్.పద్మ పేర్కొన్నారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళావరం ఏర్పాటు చేసిన టీయూసీఐ జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికుల పరిస్థితి దిగజారేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వం వేతనాలు పెంచకపోగా, ప్రస్తుత ప్రభుత్వం పని గంటలు పెంచి కార్మికులపై భారం పెంచిందన్నారు. ఈమేరకు కనీస వేతనాలు ఇవ్వడంతో పాటు పెంచిన పని గంటలను తగ్గించాలనే డిమాండ్‌తో ఈనెల 31న కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో టీయూసీఐ జిల్లా కార్యదర్శి జి.రామయ్య, అధ్యక్షుడు ఎ.వెంకన్న, నాయకులు కొయ్యల శ్రీనివాస్, సీ.వై.పుల్లయ్య, వెలదండి బాబు, ఆవుల అశోక్, శరత్, ఎస్.కే.లాల్‌మియా, గోసు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.