
రోడ్డు ప్రమాదంలో లష్కర్ మృతి
బోనకల్: మండలంలోని రావినూతల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లష్కర్ మృతి చెందాడు. కలకోటకు చెందిన యంగల అప్పయ్య (50) గతంలో వీఆర్‌ఏగా పనిచేయగా, ఇటీవల ఇరిగేషన్ శాఖలో బోనకల్ సబ్ డివిజన్ పరి ధిలో లష్కర్‌గా నియమితులయ్యాడు. విధి నిర్వహణలో భాగంగా స్వగ్రామం నుంచి బోనకల్ వైపునకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గేదె అడ్డు రావడంతో సుబాబుల్ లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొని కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. అప్పయ్య భార్య, కు మారుడు, కుమార్తె ఉండగా, కేసు నమోదు చేశామని ఎస్సై పి.వెంకన్న తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మృతి
ఖమ్మంరూరల్: మండలంలోని నాయుడుపేటకు చెందిన సానబోయిన శ్రీనివాస్(52) రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందాడు. గురువారం రాత్రి ఆయన ఖమ్మం నుంచి బైపాస్ రోడ్డు మీదుగా ద్విచక్ర వాహనంపై నాయుడుపేట సర్కిల్‌లోని తన దాబా వద్దకు వస్తున్నాడు. మార్గమధ్యలో కొత్తూరు వద్ద ద్విచక్రవాహనాన్ని రోడ్డు పక్కన ఆపి మూత్రవిసర్జన చేసి తిరిగి వాహనం స్టార్ట్ చేసే సమయాన ఖమ్మం వైపు నుంచి వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను ఖమ్మం ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. శ్రీనివాస్ టీడీపీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతుండగా, ఆయన మృతదేహం వద్ద పార్టీ నాయకులు డాక్టర్ వి.రామనాధం, కూరపాటి వెంకటేశ్వర్లు, కొండబాల కరుణాకర్, ఆరెకట్ల కొండల్‌రావు, కర్నాటి సీతారాములు, తాత సుధాకర్, రావుట్ల సత్యనారాయణ నివాళులర్పించారు.
మైనర్‌పై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష
ఖమ్మం లీగల్: మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నిందితుడు మామిడి పాపారావుకు ఇరవై ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి కె.ఉమాదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం తీర్పు వివరాలిలా ఉన్నాయి. కొత్తూరుకు చెందిన బాలిక 2023 ఆగస్టు 13న తన ఇంటి ముందు స్నేహితులతో ఆడుకుంటుండగా పాపారావు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో పాప రోదిస్తూ తన తల్లికి చెప్పగా ఆమె సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడు పాపారావుకు 20ఏళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని న్యాయాధికారి తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.డీ. ఇర్షాద్ వాదించగా, సిబ్బంది రవికుమార్, శ్రీకాంత్, చిట్టిబాబు సహకరించారు.
అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్ట్
ఖమ్మంక్రైం: వివిధ జిల్లాల్లో చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను ఖమ్మం త్రీటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సంపంది రాజేందర్, అలకుంట మహేష్‌తో పాటు ఎర్రుపాలెంకు చెందిన ఫణీందర్ 2024 డిసెంబర్‌లో ఖమ్మం నయాబజార్‌లోని ఓ ఇంట్లో చోరీ చేశారు. ఆ సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి శుక్రవారం అరెస్ట్ చేశామని సీఐ మోహన్‌బాబు తెలిపారు. వీరి నుంచి రూ.8లక్షల విలువైన సొత్తు చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, నిందితులు ఏపీలోని సామర్లకోట, అల్లవరం, అమలాపురంతో పాటు ఖమ్మం , మధిర, వైరా, రఘునాథపాలెం, మధిర రూరల్ పీఎస్ పరిధిలో చోరీలకు పాల్పడ్డారని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో లష్కర్ మృతి