
చలచల్లగా వెళ్లొద్దామా !
మండు వేసవిలో ఏసీ బస్సులకు ఆదరణ
● ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు నాన్‌స్టాప్ బస్సులు ● ఇతర డిపోల నుంచి సైతం రాజధాని, లహరి సర్వీసులు ● రెండు నెలల్లో రీజియన్‌కు రూ.7.43 కోట్ల ఆదాయం
ఖమ్మంమయూరిసెంటర్: మండు వేసవిలోనూ చల్లని గాలిలో పయనం సాగించేలా ప్రయాణికులు ఏసీ బస్సులను ఎంచుకుంటున్నారు. వారి అవసరం, ఆసక్తికి అనుగుణంగా టీజీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల సంఖ్య పెంచింది. తద్వారా ఏప్రిల్, మే నెలల్లో ఈ బస్సులు నడిపించడం ద్వారా 1,62,557 మంది గమ్యస్థానాలకు చేరడంతో ఖమ్మం రీజియన్‌కు రూ.7,43,53,892 ఆదాయం సమకూరింది. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు గంటకొకటి చొప్పున నాన్ స్టాప్ రాజధాని సర్వీసులు నడిపించడం, ఖమ్మంతో పాటు మిగతా డిపోల నుంచి రాజధాని, లహరి ఏసీ బస్సుల ద్వారా ప్రయాణికులకు సేవలందాయి.
చార్జీ ఎక్కువైనా ఓకే..
ఉమ్మడి జిల్లాలో ఈ వేసవిలో ఎండలు 42 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. ఈ నేపథ్యాన బస్టాండ్లకు వస్తున్న వారు ఏసీ బస్సు కనిపిస్తే చాలు ఎక్కేస్తున్నారు. దూర ప్రయాణాలకై తే తప్పనిసరిగా ఏసీ బస్సుల్లోనే సీట్లు ముందస్తుగా రిజర్వ్ చేసుకుంటున్నారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులతో పోలిస్తే ఏసీ బస్సుల్లో చార్జీలు అధికంగా ఉన్నా ఎండ నేపథ్యాన లెక్క చేయడం లేదు. దీంతో దాదాపు అన్ని రోజుల్లోనూ ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 100శాతం నమోదవుతోంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు సైతం ఆదివారం, ఇతర ప్రత్యేక రోజుల్లో సర్వీసుల సంఖ్య పెంచుతున్నారు. అయితే, రీజియన్‌లోని ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి డిపోలకు రాజధాని, లహరి ఏసీ బస్సులు ఉండగా ఎక్కువగా హైదరాబాద్ రూట్‌లోనే తిప్పుతున్నారు. ఇవికాక హైదరాబాద్‌లోని డిపోల నుంచి సైతం ఉమ్మడి జిల్లాకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఏసీ బస్సులు నడిపిస్తున్నారు. కాగా, కరీంనగర్, గోదావరిఖని, నిజామాబాద్, మంచిర్యాల తదితర ప్రాంతాలకు సైతం ఒకటి, రెండు ఏసీ బస్సులు ఏర్పాటుచేయాలనే ప్రయాణికుల డిమాండ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు.
రూ.7.43 కోట్ల ఆదాయం..
ఈ వేసవిలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ఏసీ బస్సులను రెగ్యులర్‌తో పోలిస్తే ఎక్కువ సర్వీసులు నడిపించింది. ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం డిపోల నుంచి ఏప్రిల్ నెలతో పాటు ఈనెల 23 వరకు 1,62,557 మంది ప్రయాణించగా రికార్డు స్థాయిలో రూ. 7,43,53,892 ఆదాయం సమకూరింది. ఇందులో 34 రాజఽ దాని బస్సుల్లో 1,49,816 మంది నుంచి రూ.6,52,25,993, నాలుగు లహరి ఏసీ బస్సుల్లో 12,741 మంది ప్రయాణించగా రూ.91,27,899 ఆదాయం నమోదైంది. రెండూ కలిపి ఏప్రిల్ నెలలో 87,322 మంది ప్రయాణించగా రూ.3,96,46,952, ఈనెల 23 వ తేదీ వరకు 75,235 మంది ప్రయాణించగా రూ.3,47,06,940 ఆదాయం సమకూరిందని ఆర్టీసీ అధికారులు విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
ఖమ్మం డిపో నుంచే..
ఖమ్మం రీజియన్‌కు వచ్చిన ఆదాయంలో ఖమ్మం డిపో నుంచే అత్యధికంగా లభించింది. ఈ రెండు నెలల కాలంలో రాజధాని బస్సులు 34, లహరి ఏసీ బస్సులు నాలుగు తిరగగా.. ఖమ్మం డిపో నుంచి 21 రాజధాని, రెండు లహరి బస్సులు తిప్పారు. రాజధాని బస్సుల్లో 96,040 మంది ప్రయాణించగా.. రూ.4,16,52,551, లహరి ఏసీ బస్సుల్లో 4,873 మంది ప్రయాణించగా రూ.45,26,719 ఆదాయం సమకూరింది. రీజియన్ మొత్తం ఆదాయంలో 62 శాతం ఖమ్మం డిపో నుంచే లభించడం విశేషం. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు గంటకొకటి చొప్పున రాజధాని ఏసీ నాన్ స్టాప్ బస్ నడపడం కలిసొచ్చింది.
ఏప్రిల్, మే 23వరకు ఏసీ బస్సులతో వచ్చిన ఆదాయం
డిపో ప్రయాణికులు ఆదాయం (రూ.ల్లో)
ఖమ్మం 1,00,913 4,61,79,270
భద్రాచలం 37,563 1,71,23,886
సత్తుపల్లి 21,237 98,56,103
కొత్తగూడెం 2,844 11,94,633
మొత్తం 1,62,557 7,43,53,892
మరిన్ని నాన్‌స్టాప్ సర్వీసులు
సుఖవంతంగానే కాక త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు రాజధాని ఏసీ బస్సులు తిప్పుతున్నాం. ఈ వేసవిలో ఏసీ బస్సులకు ఆదరణ పెరిగింది. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు నడిచే నాన్‌స్టాప్ సర్వీసులను ప్రయాణికులు ఆదరిస్తున్నారు. దీంతో రీజియన్ వ్యాప్తంగా నాన్‌స్టాప్ ఏసీ సర్వీసులు పెంచేలా ఆలోచన చేస్తున్నాం.
– ఎ.సరిరామ్, ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్

చలచల్లగా వెళ్లొద్దామా !

చలచల్లగా వెళ్లొద్దామా !

చలచల్లగా వెళ్లొద్దామా !