
విద్యుదాఘాతంతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
తల్లాడ: మండలంలోని మల్లవరంలో శుక్రవారం విద్యుదాఘాతంతో ట్రాక్టర్ డైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుంభగిరి బలరాం (45) దళితకాలనీ సమీపాన ఉన్న చికెన్ షాపు వెనకాల మూత్ర విసర్జనకు వెళ్లాడు. అయితే, ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ వైర్‌ను తాకిన ఆయన షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడ ఎవరూ లేక పోవడంతో విషయం బయటకు రాలేదు. మధ్యాహ్నం తర్వాత ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కాగా, బలరామ్‌కు భార్య సుశీల, ఇద్దరు పిల్లలు ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బంగారు ఆభరణాల చోరీ
తిరుమలాయపాలెం: మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి పట్టపగలే బంగారు, వెండి వస్తువులు చోరీ చేసిన ఘటనపై శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన పగిళ్ల రామకృష్ణ తన భార్యతో కలిసి ఈ నెల 20న ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో బీరువా తెరిచి ఉండడంతో వెతికి చూడగా అందులోని సుమారు రూ.85 వేల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో బాధితుడు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మల్లారంలో..
ముదిగొండ: మండలంలోని మల్లారంలో జరిగిన చోరీపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు... మల్లారం గ్రామానికి చెందిన బొగ్గారపు హనుమంతరావు గురువారం రాత్రి భోజనం అనంతరం ఆరు బయట పడుకోగా, ఆయన భార్య సుజాత దవరండాలో నిద్రించింది. అర్ధరాత్రి గాలివాన వస్తుండడంతో ఇరువురు ఇంట్లోకి వెళ్లగా ఇంటి మధ్య గది తలుపులు తెరిచి ఉండడమే కాక బీరువాలో భద్రపరిచిన బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదు. సుజాత తలదిండు కింద పెట్టిన తాళాలను గుర్తించిన దుండగులు వాటి సాయంతో బీరువా తెరిచి ఆభరణాలు దొంగిలించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ముదిగొండ సీఐ ఓ.మురళి తెలిపారు.
గ్యాస్ లీకేజీతో మంటలు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం రోటరీనగర్‌లోని ఓ ఇంట్లో శుక్రవారం గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగాయి. ఇంట్లో నివాసముంటున్న వారు వంట చేసే క్రమాన స్టవ్ వెలిగించగా అప్పటికే గ్యాస్ లీక్ అయి ఉండడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమతమైన వారు సిలిండర్‌ను బయటకు తీసుకొచ్చి నీళ్లు చల్లినా మంటలు అదుపులోకి రాలేదు. ఈక్రమాన ఏం జరుగుతోందనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, అప్పటికే అందిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది.