
వల పన్ని.. పట్టుకున్నారు!
● స్టేషన్‌లో ఎఫ్‌ఓబీ పైనుంచి దూకేందుకు ఛత్తీస్‌గఢ్ యువకుడి యత్నం ● కింద వల అమర్చి కాపాడిన పోలీస్, అగ్నిమాపక శాఖ సిబ్బంది
ఖమ్మంక్రైం: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో ఖమ్మం రైల్వేస్టేషన్‌లో శుక్రవారం హల్‌చల్ చేశాడు. ఫుట్‌ఓవర్ బ్రిడ్జి పైనుంచి దూకేందుకు యత్నించడం కలకలం రేపింది. ఈ ఘటనతో సుమారు గంటపాటు గందరగోళం నెలకొనగా, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చివరకు ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ, అగ్నిమాపక శాఖ సిబ్బంది చొరవతో కింద వలలు ఏర్పాటుచేసి.. ఆ యువకుడిని తోసేయడంతో వలపై పడగా అంతా ఊపిరిపీల్చుకున్నారు.
మద్యం మత్తు.. కుటుంబ కలహాలు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడు లలిత్ బరిహ ఖమ్మం సమీపాన గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాలతో మద్యం సేవించిన ఆయన ఆత్మహత్య చేసుకుంటానంటూ శుక్రవారం రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. రెండో నంబర్ ప్లాట్‌పాం మీదుగా ఫుట్‌ఓవర్ బిడ్జిపైకి ఎక్కి దూకడానికి యత్నించాడు. బ్రిడ్జి కింద హైపర్ టెన్షన్ విద్యుత్ వైరు ఉండడం, అదే సమయానికి సికింద్రాబాద్‌కు వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రానుండడంతో వేచి ఉన్న ప్రయాణికులు లలిత్‌ను గమనించి ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ సురేశ్‌గౌడ్ ఆధ్వర్యాన సిబ్బంది చేరుకుని ఎంత నచ్చజెప్పినా వినకపోగా, పైకి ఎవరైనా వస్తే దూకుతానని బెదిరించాడు. ఆపై ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చి, బ్రిడ్జిపైకి ప్రయాణికులు వెళ్లకుండా ఆపివేశారు. ఇంతలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వస్తుడడంతో ఖమ్మం ఔటర్‌లోనే నిలిపివేశారు. ఆ తర్వాత అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని బ్రిడ్జి కింద వలలతో సిద్ధమయ్యారు. ఇదంతా సుమారు గంట దాటడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది ఒకరు పైకి వెళ్లి లలిత్ తీగలపై పడకుండా వలలో పడేలా కిందకు తోశాడు. దీంతో ఆయన నేరుగా వలలో సురక్షితంగా పడటంతో ఆర్పీఎఫ్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ అనంతరం కుటుంబీకులకు సమాచారం అందించారు. కాగా, లలిత్ తీరుతో రైళ్లు నిలిచిపోవటంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా, ఆయన ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఫైర్ సిబ్బందిని పలువురు అభినందించారు.

వల పన్ని.. పట్టుకున్నారు!