
అంతులేని చెత్త సమస్య
వైరా: వైరా మున్సిపాలిటీ ఏర్పడి ఏడేళ్లు అవుతోంది. అయినా సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. కొన్నాళ్ల క్రితం వరకు రహదారులు, సైడ్ డ్రెయిన్లు సరిగ్గా లేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కోగా అందుకు నిధులు విడుదల కావడంతో కొంత మేర ఇక్కట్లు తీరాయి. ఇక చెత్త సేకరణ, డంపింగ్ యార్డుల ఏర్పాటు మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. దీంతో ఇంటింటా వెలువడే చెత్త సేకరిస్తున్నా డంపింగ్‌కు సరైన ప్రదేశాలు గుర్తించక, గుర్తించినా వాహనాలు వెళ్లే మార్గం లేక సమస్య ఎటూ తేలడం లేదు. అయితే, ఇది కేవలం వైరాలో మాత్రమే కాదు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలనూ వేధిస్తోంది.
కలెక్టర్లే పరిశీలించినా...
వైరాలో 20 వార్డులకు గాను సుమారు 40వేల జనాభా ఉండగా, ప్రతీరోజు 8 – 10 టన్నుల చెత్త విడుదలవుతోంది. ఈ చెత్త సేకరణకు ఎనిమిది ఆటో రిక్షాలు, ఎనిమిది ట్రాక్టర్లు వినియోగిస్తున్నారు. కానీ సేకరించిన చెత్తను ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగేళ్లలో ఇద్దరు, ముగ్గురు కలెక్టర్లు ఈ సమస్యపై దృష్టి సారించినా, ఏడాదిన్నర క్రితం స్థలం కేటాయించినా ఉపయోగం లేకపోయింది. సదరు స్థలానికి చెత్త తీసుకెళ్లేలా సరైన మార్గం లేకున్నా, ఇది పట్టణానికి ఐదు కి.మీ. దూరంలో ఉన్నా అష్టకష్టాలకోర్చి చెత్త తరలిస్తుండడంతో డీజిల్ ఖర్చులు పెరిగాయి.
వర్షాకాలం వస్తే ఇక్కట్లే
రెండేళ్లుగా వైరా సమీపంలోని స్టేజీ పినపాక హైలెవల్ వంతెన కింద చెత్త వేస్తూ నిప్పుపెడుతున్నారు. దీంతో ప్రయాణికులు, స్థానికులకు అసౌకర్యంగా మారింది. ఈమేరకు ఏడాదిన్నర క్రితం రిజర్వాయర్ అలుగుల సమీపాన తల్లాడ మండలం కొడవటిమెట్ట రెవెన్యూలో మూడెకరాల స్థలాన్ని డంపింగ్ యార్డుకు కేటాయించారు. కానీ ఇక్కడకు చెత్త తరలించాలంటే క్రాస్ రోడ్డు నుండి రిజర్వాయర్ ఆనకట్ట కింది భాగం మీదుగా వెళ్లాలి. ఈ మార్గంలో మూడు అలుగు వాగులు ఉండడంతో వర్షాకాలంలో రిజర్వాయర్ నీటిమట్టం 18.4 అడుగులు చేరిందంటే వరద ప్రవహిస్తుంది. ఫలితంగా రెండు నెలలు ప్రత్యామ్నాయం వెతకాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాగా, రహదారి మెరుగుపరిచేలా పలు ప్రతిపాదనలు రూపొందించారు. మూడు వాగులపై కల్వ ర్టులు లేదా బ్రిడ్జి నిర్మించడంతో పాటు మెటల్ రోడ్డు నిర్మాణానికి రూ.1.7 కోట్లు, అవసరమైన చోట సీసీ రోడ్డు వేస్తూ చప్టాలు నిర్మించాలంటే రూ.2 కోట్లు, కల్వర్టులతో పాటు బీటి రోడ్డు వేయాలంటే రూ.2.5 కోట్లకు పైగా అవసరమని ప్రతిపాదించారు. దీనికి అనుమతులు వచ్చినా వానాకాలంలో చెత్త తరలించాలంటే ప్రహసనంగానే మారనుంది. మరోచోట 2–3 ఎకరాల స్థలం కొనాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కాక రిజర్వాయర్‌ను ఆనుకుని ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుంటే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నందున అధికారులు ఆ దిశగా ఆలోచన చేయాలని పలువురు కోరుతున్నారు.
జిల్లాలోని మున్సిపాలిటీల వివరాలు
మున్సిపాలిటీ వార్డులు జనాభా రోజువారీ వాహనాలు
చెత్త (టన్నుల్లో)
వైరా 20 40,000 10 16
సత్తుపల్లి 23 38,000 11 15
మధిర 22 35,000 20 17
ఏదులాపురం 32 60,000 10 20
సమస్యను అధిగమిస్తాం..
వైరాలో డంప్ యార్డుకు గుర్తించిన స్థలం పట్టణానికి దూరంగా ఉంది. అక్కడే చెత్త డంప్ చేస్తుండగా, సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. కలెక్టర్
ఆదేశాలతో తుది నిర్ణయం ఉంటుంది. ఈ మార్గంలో కల్వర్టుల నిర్మాణానికి అంచనాలు రూపొంచినందున త్వరలోనే సమస్యను అధిగమిస్తాం.
– చింతల వేణు, మున్సిపల్ కమిషనర్, వైరా
వైరా మున్సిపాలిటీలో
డంప్ యార్డు ఇక్కట్లు
మిగతా మూడుచోట్ల సేకరణ,
తరలింపులో నిర్లక్ష్యం
వర్షాకాలం వస్తే
మరింత ఇబ్బందులు

అంతులేని చెత్త సమస్య

అంతులేని చెత్త సమస్య

అంతులేని చెత్త సమస్య