
రండీ.. త్వరపడండి!
● టీఎంఆర్‌ఈఐఎస్‌ల్లో శరవేగంగా ప్రవేశాలు ● జిల్లాలో ఏడు పాఠశాలలు, ఒక కాలేజీ ● గత ఏడాది ఉత్తమ ఫలితాలు రావడంతో విద్యార్థుల ఆసక్తి
ఖమ్మంమయూరిసెంటర్: మైనార్టీల కోసం ప్రత్యేకంగా స్థాపించిన రెసిడెన్షియల్ పాఠశాలల్లో తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ(టీఎంఆర్‌ఈఐఎస్) ద్వారా 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈనెల 31వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశముంది. అన్ని పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తుండగా, 6నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్లు మాత్రమే భర్తీ చేస్తారు. ఇక జూనియర్ కళాశాలలో ఇంటర్‌కు సంబంధించి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీలో సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, సీట్ల వరకే దరఖాస్తులు వస్తే నేరుగా ప్రవేశాలు కల్పించనుండగా, అంతకు మించి దరఖాస్తులు అందితే మాత్రం డ్రా విధానాన్ని పాటించనున్నారు.
మైనార్టీలకు ఉచిత విద్య
టీఎంఆర్‌ఈఐఎస్‌ల ద్వారా వేలాది మంది మైనార్టీ పిల్లలకు ఉచిత విద్య, హాస్టల్ వసతితో పాటు ఆధునిక కంప్యూటర్ విద్య, క్రీడలు, నైపుణ్య శిక్షణ అందుతున్నాయి. గత విద్యాసంవత్సరం ఈ పాఠశాలల్లో ఎస్సెస్సీ విద్యార్థులు 95.37 శాతం, ఇంటర్ విద్యార్థులు 85.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇతర ప్రభుత్వ గురుకులాలతో సమానంగా ఫలితాలు సాధించడంతో పాటు పోటీ పరీక్షల్లో సత్తా చాటేలా తీర్చుతుండడంతో నీట్, ఐఐటీ–జేఈఈ, ఒలింపియాడ్, క్రీడాపోటీల్లోనూ ప్రతిభ చాటుతున్నారు.
ప్రవేశాలకు ఆహ్వానం..
విద్య, సమానత్వం, సామాజిక న్యాయాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుంటూ మైనార్టీల కోసం టీఎంఆర్‌ఈఐఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రఘునాథపాలెంలో ఖమ్మం గర్ల్స్–1(శారద ఇంజనీరింగ్ కళాశాల), ఖమ్మంలోని అల్లిపురం రోడ్డులో ఖమ్మం గర్ల్స్–2, కొణిజర్లలో ఖమ్మం బాయ్స్–1(పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కాలేజీ), సత్తుపల్లి గుడిపాడు రోడ్డులో సత్తుపల్లి బాయ్స్–1, జలగంనగర్‌లో నేలకొండపల్లి బాయ్స్–1, సింగరేణిలోని ఎస్‌ఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోని వైరా గర్ల్స్–1, మధిర మండలం జీలుగుమాడులోని మధిర బాయ్స్–1 పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఇక ఖమ్మం రాపర్తినగర్‌లోని జూనియర్ కళాశాల(ఖమ్మం గర్ల్స్–1) ప్రవేశాలు కొనసాగుతున్నాయి.
సద్వినియోగం చేసుకోవాలి..
టీఎంఆర్‌ఈఐఎస్ విద్యాసంస్థల్లో ప్రవేశాలు వేగంగా సాగుతున్నాయి. ఐదో తరగతికి అన్ని పాఠశాలల్లో సీట్లు అందుబాటులో ఉండగా, 6 – 9వ తరగతికి మాత్రం ఖాళీల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాం. ఈనెల 31లోగా సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. – డాక్టర్ బి.పురంధర్,
జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి

రండీ.. త్వరపడండి!