
ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే..
బోనకల్/నేలకొండపల్లి: పశువుల అక్రమ రవాణాను నియంత్రించేలా ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని అడిషనల్ డీసీపీ ప్రసాదరావు ఆదేశించారు. బోనకల్ మండలం పాలడుగుతో పాటు జిల్లాలోని పలుచోట్ల ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్‌లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ మాట్లాడుతూ చెక్‌పోస్ట్‌ల వాహనాలను తనిఖీ చేస్తూ అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయా, లేదా అని పరిశీలించాలని, అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలితే వాహనాలను సీజ్ చేయాలని తెలిపారు. అలాగే, నేలకొండపల్లి పోలీసుస్టేషన్‌కు వచ్చిన అదనపు డీసీపీ ప్రసాదరావు రికార్డులను పరిశీలించాక శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల విచారణపై ఉద్యోగులకు సూచనలు చేశారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా వేయాలని ఆదేశించారు.
శారీరక శిక్షణ,
ఆయుధ విజ్ఞానం
వైరా: వైరాలోని న్యూలిటిల్ ఫ్లవర్స్ స్కూల్‌లో ఏర్పాటుచేసిన 11(బీ) బెటాలియన్ ఎన్‌సీసీ వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతోంది. ఈ శిబిరాన్ని వీరచక్ర అవార్డు గ్రహీత, వీఆర్‌సీ గ్రూప్ కమాండర్ కల్నల్ సచిన్ అన్నారావు సెంబాల్కర్ శుక్రవారం సందర్శించారు. కల్నల్ ఎస్‌కే.భద్ర, కల్నల్ నవీన్‌యాదవ్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న శిబిరంలో భాగంగా కేడెట్లకు శారీరక శిక్షణ, ఆయుధాల పనితీరుపై అవగాహన కల్పిస్తూనే నాయకత్వ లక్షణాలపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రూప్ కమాండర్ మాట్లాడుతూ ఎన్‌సీసీ శిక్షణతో సంఘ జీవనం, ప్రభుత్వ కార్యకలాపాలపై అవగాహన పెరగడమే కాక దేశభక్తి పెరుగుతుందని తెలిపారు. పాఠశాల కరస్పాడెంట్ పి.భూమేఽష్‌రావు, డైరెక్టర్ కుర్రా సుమన్, అపురూపాదేవి తదితరులు పాల్గొన్నారు.
కోచ్‌ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ మోడల్ స్పోర్ట్స్ స్కూళ్లలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై ఏడాది కాలానికి కోచ్‌లను నియమించనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. కిన్నెరసానిలో మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో ఆర్చరీ కోచ్, కాచనపల్లిలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో కబడ్డీ కోచ్ ఎంపికకు ఎన్‌ఎస్, ఎన్‌ఐఎస్‌లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్ములని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ధ్రువపత్రాలతో ఈనెల 26నుంచి జూన్ 3వ తేదీ వరకు ఐటీడీఏలోని స్పోర్ట్స్ ఆఫీసర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా కానీ dtdo.bhadradri@gmail.com మెయిల్ ద్వారా కానీ దరఖాస్తులు పంపించాలని సూచించారు. వివరాలకు 98489 88205, 99123 62053 నంబర్లకు సంప్రదించాలని పీఓ తెలిపారు.

ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే..