
ఫలరాజు ఫలించేలా..
యాజమాన్య పద్ధతితో అధిక లాభాలు
● నేల సారవంతానికి దుక్కులు అవసరం ● కొమ్మ కత్తిరింపులతో తెగుళ్ల నివారణ ● వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్
వైరా: దేశంలో పండించే పండ్ల తోటల్లో ప్రధానమైనది, ఫలరాజుగా పేరుగాంచినది మామిడి. అయితే దీని సాగు విస్తీర్ణం దేశంలో మొత్తం 35శాతం ఉండగా.. 22,58,130 హెక్టార్లలో విస్తరించి ఉంది. రాష్ట్రంలో 1,15,990 హెక్టార్లు, జిల్లాలో 13,674 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. సాధారణంగా మామిడి రైతులు పూత, కాత దశలో మాత్రమే మామిడి తోటలపై దృష్టి సారించి చెట్టుకు కావాల్సిన ఎరువులు అందిస్తుంటారు. దీని వలన సరైన పోషకాలు అందక పూత సకాలంలో రాకపోవడం, వచ్చిన పూత, పిందె సరిగా నిలవక దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యాన అధిక దిగుబడులు సాధించేందుకు కోత అనంతరం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలని వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ సూచిస్తున్నారు.
కొమ్మ కత్తిరింపులు..
● మామిడి కాయ కోత అనంతరం కాయ తొడిమలున్న కొమ్మలు, ఎండిన కొమ్మలు, తెగులు సోకిన, విరిగిన కొమ్మలు, చెట్ల లోపల గాలి, వెలుతురు ప్రవేశానికి అడ్డుగా ఉన్న కొమ్మలను కత్తిరించాలి.
● పూత కాడల నుంచి వెనుకకు 15 సెంటీ మీటర్లు వరకు కత్తిరిస్తే నవంబర్, డిసెంబర్‌లలో కొత్త కొమ్మలు పుట్టుకొచ్చి, అవే వచ్చే రుతువులో పుష్పిస్తాయి.
● ప్రతీ రెమ్మ చివరి నుంచి 3–5 చిగుర్లు వస్తే ఆరోగ్యంగా ఉన్న రెండింటిని నిలుపుకొని మిగిలిన వాటిని తీసివేయాలి.
● కత్తిరింపులతో కొంత మేర తెగుళ్లు తగ్గే అవకాశం ఉండగా.. కత్తిరించిన కొమ్మ భాగాలకు బోర్డ్‌ఫేస్ట్ పూయాలి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములను లీటరు నీటికి కలిపి చెట్టంతా తడిచేలా పిచికారీ చేయాలి.
దుక్కి దున్నడం..
తొలకరిలో అనగా జూన్, జూలై మాసాలలో రైతాంగం చెట్ల మధ్యన దున్నాలి. దీని వలన కోశస్థ దశలో ఉన్న పురుగులు, కలుపు నివారించబడడడంతో పాటు నేల గుల్లబారి, వేర్లకు గాలి బాగా చేరి చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా నేలకు వర్షపు నీటిని పట్టి ఉంటే గుణం పెరిగి నేల సారవంతమవుతంది. మూడవ దుక్కి అక్టోబర్‌లో చేపడినట్లయితే నేలలో తేమ ఆరిపోయి సకాలంలో పూత రావడానికి దోహదపడుతుంది. దున్నేటప్పుడు చెట్టు నుంచి 1–5 మీటర్ల దూరంలో దున్నడం ఉత్తమం.
ఎరువుల యాజమాన్యం..
కాసే తోటలో చెట్లకు సరిఝైన మోతాదులో ఎరువులు అందించాలి. ఒక సంవత్సరం వయసున్న చెట్లకు 10 కిలోల పశువుల ఎరువు, 200 గ్రాములు యూరియా, 600 గ్రాములు సింగిల్ సూపర్ పాస్పేట్, 150 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను వేయాలి.
అదే ఐదేళ్ల వయసున్న చెట్లకు 50 కిలోల పశువుల ఎరువు, కిలో యూరియా, 3 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్, 730 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి.
పదేళ్లు, ఆపై వయసు గల చెట్లకు 100 కిలోల పశువులు ఎరువు, 2.2 కిలోల యూరియా, 6 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్, 1.75 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి.
మామిడి కోత అయ్యాక సిపార్సు చేసిన 2/3 వంతు ఎరువులను వేయాలి. మిగతా 1/3 భాగం ఎరువులను కాయ ఎదుగుదల దశలో ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంలో వేయాలి. సూక్ష్మధాత లోపాలు ఎక్కువుగా ఉన్న తోటల్లో చెట్టుకు 150 గ్రాములు జింక్ సల్ఫేట్, 75 గ్రాములు బోరాక్స్, 100 గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్ 125 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ పశువుల ఎరువుతో కలిపి జూన్, జూలై మాసాలలో మొక్కల పాదుల్లో వేయాలి. ఈ విధంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మామిడి చెట్లు సెప్టెంబర్, అక్టోబర్‌లో కొత్త చిగుర్లు వేసి సకాలంలో పూత రావడమే గాక మంచి దిగుబడులు పొందవచ్చు.