
బావిలో పడి ఆవు, రెండు దూడలు మృతి
చింతకాని: మేత కోసం అడవికి వెళ్లిన ఆవు, రెండు దూడలు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన ఘటన చింతకానిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. చింతకాని గ్రామానికి చెందిన బండి సతీష్‌కు చెందిన ఆవు, ఉసికల తుమ్మలయ్యకు చెందిన పెయ్య దూడ, గడ్డం రాఘవులకు చెందిన కోడె దూడలను మూడు రోజుల క్రితం మేత కోసం అడవికి పంపించారు. చింతకాని నుంచి రేపల్లెవాడ వెళ్లే రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఆవు, రెండు దూడలు అందులో పడి మృతి చెందాయి. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో మూడు రోజుల నుంచి వాటి కోసం వెతుకుతుండగా.. గురువారం సాయంత్రం స్థానిక రైతులు చూసి సమాచారం ఇవ్వడంతో వాటిని జేసీబీ సాయంతో బయటకు తీశారు. సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు.
విద్యుదాఘాతంతో
పాడి గేదె మృతి
రఘునాథపాలెం: మండలంలోని చిమ్మపుడి గ్రామంలో బుధవారం రాత్రి ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడగా.. పాడి గేదె మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తెల్ల బోయిన శ్రీనుకు చెందిన గేదె గురువారం ఉదయం మేతకు వెళ్లగా.. అప్పటికే తెగి పడిన తీగలకు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందిందని తెలిపారు. దీని విలువ సుమారు రూ.70 వేలు ఉంటుందని బాధిత రైతుల వాపోయాడు. కాగా, ఘటనా స్థలాన్ని మండల మాజీ వైస్ ఎంపీపీ గుత్తా రవి పరిశీలించి బాధిత రైతుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

బావిలో పడి ఆవు, రెండు దూడలు మృతి