
ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి
ఖమ్మంమయూరిసెంటర్: దండకారణ్యం నారాయణపూర్, బస్తర్‌లో బుధవారం జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం ఖమ్మంలోని మంచికంటి హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్, ప్రజా సంఘాల నేతలు కాకి భాస్కర్, డాక్టర్ ఎంఎఫ్.గోపీనాథ్ మాట్లాడారు. మూడు నెలలుగా మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ ప్రకటించినా.. కేంద్ర ప్రభుత్వం కాల్పులు జరుపుతూనే ఉందన్నారు. శాంతి చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపినా 2026 మావోయిస్టు రహిత దేశంగా మార్చుతామని కేంద్రం అమాయకులను పొట్టనబెట్టుకుంటుందన్నారు. తాజాగా జరిపిన ఎన్‌కౌంటర్ మధ్య భారతదేశంలో ఉన్న ఖనిజ సంపదను గుజరాత్ మార్వాడీలకు దోచిపెట్టే కుట్రలో భాగమే ఈ ఎన్‌కౌంటర్‌లు అన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ 23న సాయంత్రం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు వై.విక్రమ్, సింగు నర్సింహారావు, సీ.వై.పుల్లయ్య, రవి మారుత్, దేవిరెడ్డి విజయ్, చిర్ర రవి, విప్లవ కుమార్, రమణాల లక్ష్మయ్య, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.