
స్లాట్ బుక్ చేసుకుని పడిగాపులు
నేలకొండపల్లి: స్లాట్ బుక్ చేసుకున్న రైతులు గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాశారు. వివరాలిలా ఉన్నాయి. ఇటీవల స్లాట్ బుక్ రైతులకు గురువారం మండల తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం అవకాశం కల్పించారు. దీంతో వారు తమ చంటి పిల్లలతో సహా ఉదయం 10 గంటలకు కార్యాలయానికి చేరుకోగా.. తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో రాత్రి 9 గంటల వరకు కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. తిండి తిప్పలు లేకుండా కార్యాలయంలో వేచి ఉన్న రైతులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై తహసీల్దర్ వి.వెంకటేశ్వర్లును వివరణ కోరగా.. ఖమ్మంలో జిల్లా అధికారులతో సమావేశం ఉన్నందున్న ఆలస్యమైందని వెల్ల డించారు.
డీఎస్పీ సేవలకు గుర్తింపు
కొత్తగూడెంఅర్బన్: పొక్సో కేసులో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి కేసుల పరిష్కారానికి కృషి చేసిన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్‌కు గుర్తింపు లభించింది. పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్‌కు ప్రశంసాపత్రం లభించగా.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో గురువారం డీఎస్పీని అభినందించారు.