
సుకినీతండాలో మూగ గోస..
రఘునాథపాలెం: మండలంలోని సుకినీతండాలో అనుమానాస్పద స్థితిలో పలువురు రైతులకు చెందిన నాలుగు ఆవులు గురువారం మృతి చెందాయి. బుధవారం మేతకు వెళ్లిన పశువులు రాత్రి నుంచి తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. గమనించిన రైతులు వెంటనే చికిత్స చేయించినా ప్రయోజనం లేకుండా మాలోతు బద్యా, జగ్యా, రవి, సీతులకు చెందిన నాలుగు ఆవులు మృతి చెందాయి. అదేవిధంగా గ్రామానికి చెందిన వీరా, శంకర్, రవిలకు చెందిన మరో మూడు ఆవులు తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతుండగా.. పాపటపల్లి పశువైద్యాధికారి గంగాధర్ ఆధ్వర్యాన వైద్యసిబ్బంది చికిత్స అందిస్తున్నారు. మేతకు వెళ్లిన సమయాన పొలాల్లో పురుగుమందుల డబ్బాలు, గాబుల్లో వర్షపు నీరు నిలిచి ఉండగా, అవి తాగిన కారణంగానే పశువులకు ఇలా ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఖరీఫ్ వ్యవసాయ పనులు ప్రారంభమైన వేళ పశువుల మృతితో రైతు కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయి. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు వేడుకుంటున్నారు.
నాలుగు ఆవుల మృతి