
చట్టాన్ని అతిక్రమిస్తే డీలర్లపై పీడీ యాక్ట్
కొణిజర్ల/కూసుమంచి: పత్తి సహా అన్ని పంటల విత్తనాలను అమ్మే డీలర్లు చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని, ఏ మాత్రం పొరపాట్లకు తావిచ్చినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య హెచ్చరించారు. కొణిజర్ల మండలం తనికెళ్ల రైతు వేదికలో వైరా డివిజన్ పరిధి డీలర్లకు, కూసుమంచి రైతు వేదికలో పాలేరు డివిజన్ డీలర్లకు బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన పీఓఎస్ మిషన్లు అందజేశాక మాట్లాడారు. వానాకాలం సీజన్‌కు సరిపడా పత్తి విత్తనాలు సిద్ధంగా ఉన్నందున, అమ్మే సమయాన బిల్లుపై అన్ని వివరాలు నమోదు చేయాలని సూచించారు. అలాగే, ఏరోజుకా రోజు స్టాకు వివరాలను బోర్డులో ప్రదర్శించాలని తెలిపారు. ధరల్లో వ్యత్యాసం వచ్చినా, రైతులు కోరినవి కాకుండా ఇతర కంపెనీల విత్తనాలు అమ్మాలని యత్నించినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏడీఏలు వాసవీరాణి, టి.కరుణశ్రీ, సరిత, ఎస్సైలు జగదీష్, దివ్య, ఏఓలు బాలాజీ, నరసింహారావు, అశోక్, మంజుఖాన్, అనిల్‌కుమార్, పవన్, వాణి, సీతారాంరెడ్డి, రాధా, ఉమానగేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య