
బడ్డీ.. బుడిబుడిగానే
యాప్‌ల్లో కానరాని మున్సిపాలిటీల వివరాలు
● పాతవి అప్‌డేట్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం ● అప్‌డేట్, అవగాహనలో వెనుకబాటు ● కేఎంసీ మినహా అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి
అందరి చేతిలో ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన సెల్‌ఫోన్లు ఉన్నాయి. దీంతో మున్సిపాలిటీల పరిధిలో ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సమాచారం చేరవేసేందుకు గాను ప్రభుత్వం సిటిజన్ బడ్డీ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఏ సమస్యపై అయినా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశముండగా, అనుమతుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాక ఫిర్యాదుల స్థితిగతులను ఎప్పటికప్పుడు చూడొచ్చు. కానీ ఈ యాప్ నిర్వహణ, వివరాల అప్‌డేట్‌తో పాటు ప్రజలకు అవగాహన కల్పించడంలో జిల్లాలోని మున్సిపాలిటీల అధికారులు నిర్లిప్తత
కనబరుస్తున్నారు. – సత్తుపల్లి
కమిషనర్‌తో పాటు సీడీఎంఏకు...
సిటిజన్ బడ్డీ యాప్ ద్వారా మున్సిపాలిటీల పరిధిలో అనుమతి కోసం దరఖాస్తులు, సమస్యలపై ఫిర్యాదు చేయగానే సమాచారం సంబంధిత కమిషనర్‌తో పాటు సీడీఎంఏ(హైదరాబాద్)కు వెళ్తుంది. తద్వారా సమస్యల సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 2019లో ప్రవేశపెట్టిన ఈ యాప్ ద్వారా అన్ని వివరాలను ఉన్నతాధికారులు పర్యవేక్షించే వీలుండడంతో మున్సిపాలిటీల అధికారులు పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తారనే నమ్మకం కలిగేది. కానీ జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మినహాయిస్తే పాత మున్సిపాలిటీలైన సత్తుపల్లి, మధిర, వైరాతో పాటు కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ వివరాల కోసం ఆరా తీస్తే పాత వివరాలే దర్శనమిస్తుండడం గమనార్హం. యాప్‌లో అప్‌డేట్ చేయడం, ఉపయోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడం అధికారుల బాధ్యత అయినా నిర్లక్ష్యం కనబరుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో యాప్ ఉన్న విషయం చాలా మందికి తెలియకపోగా... చిన్నాపెద్ద సమస్య ఏదైనా మున్సిపల్ కార్యాలయాలకు వ్యయప్రయాసలకోర్చి రావాల్సి వస్తోంది. అక్కడ లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు, దరఖాస్తులు ఇచ్చినా ఎప్పటికి పరిష్కరిస్తారో స్పష్టత ఉండడం లేదు. ఇదే సమయాన పౌరసేవ పత్రం ఆధారంగా సమయం ప్రకారం సమస్యలు పరిష్కరించకపోగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏ ఉద్యోగిపైనా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు.
పాలకవర్గాలు లేకున్నా..
కమిషనర్లు మారినా...
జిల్లాలోని మున్సిపాలిటీ సమాచారం ఏ మేరకు అప్‌డేట్ చేశారోనని సిటిజన్ బడ్డీ యాప్‌లో పరిశీలిస్తే అన్నీ పాత వివరాలే కనిపిస్తున్నాయి. ఏడాది క్రితం వరకు అప్పుడప్పుడు కొందరు పలు విభాగాలపై ఫిర్యాదులు చేశారు. వీటిలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినా కొన్ని పరిష్కరించినట్లు, మరికొన్ని తిరస్కరించినట్లు అందులో పేర్కొన్నారు. ఇక సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగిసి నెలలు గడిచినా యాప్‌లో ఇంకా చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లు అలాగే ఉన్నాయి. ఇది పక్కన పెడితే సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహా విధుల్లోకి చేరి రెండు నెలలు కావొస్తున్నా గతంలో పనిచేసిన రవిబాబు పేరు ఫొటో సహా ఉంది. వైరా కమిషనర్‌గా చింతా వేణు విధులు నిర్వర్తిస్తుండగా గతంలో పనిచేసిన ఎన్.వెంకటపతి రాజు పేరు, ఫొటో తొలగించలేదు. మధిర మున్సిపాలిటీకి సంబంధించి కమిషనర్ ఎవరు పనిచేస్తున్నారో అసలు అప్‌డేటే చేయలేదు. కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ వివరాలు ఏవీ కూడా యాప్‌లో పొందుపర్చలేదు. కేవలం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వివరాలు అన్నీ సక్రమంగా ఉండడం విశేషం.
సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్‌గా ఎం.రవిబాబు విధులు నిర్వర్తిస్తున్నట్లుగా ఫొటోతో సహా సిటిజన్ బడ్డీ యాప్‌లో కనిపిస్తోంది. కానీ ఇక్కడ కమిషనర్‌గా కె.నర్సింహ విధుల్లో చేరి రెండు నెలలు దాటింది. ఇదొక్కటే కాక మిగతా మున్సిపాలిటీల వివరాలూ అప్‌డేట్ కాకపోగా.. నెలల క్రితమే గడువు ముగిసిన పాలకవర్గాల వివరాలు కూడా తొలగించకపోవడం గమనార్హం.
వాట్సాప్‌కు పంపిస్తున్నారు..
చాలా మంది సమస్యలను వాట్సాప్‌కు పంపిస్తుండడంతో వెంటనే పరిష్కరిస్తున్నాం. సిటిజన్ బడ్డీ యాప్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఫిర్యాదులు, దరఖాస్తులు నమోదు చేసేలా చూస్తాం. మా ఉద్యోగుల ఫోన్లలోనూ యాప్ డౌన్‌లోడ్ చేయించి ఫిర్యాదుల పరిశీలనకు ఆదేశాలు ఇస్తాం. అలాగే, యాప్‌లో వివరాలు కూడా అప్‌డేట్ చేస్తాం.
– కె.నర్సింహ, మున్సిపల్ కమిషనర్, సత్తుపల్లి

బడ్డీ.. బుడిబుడిగానే

బడ్డీ.. బుడిబుడిగానే

బడ్డీ.. బుడిబుడిగానే

బడ్డీ.. బుడిబుడిగానే