
ఆ సొమ్ము రికవరీ ఎలా?
● మెప్మాలో పలువురు ఆర్పీల చేతివాటం ● సంఘాలు లేకుండానే రుణాల డ్రా ● పత్రాలు చూడకుండానే మంజూరుపై అనుమానాలు
ఖమ్మంమయూరిసెంటర్: మహిళా సంఘాలను అడ్డుపెట్టుకుని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మెప్మాలోని కొందరు రిసోర్స్ పర్సన్లు(ఆర్పీలు) బ్యాంకుల నుండి రుణాల పేరిట రూ.లక్షల్లో కొల్లగొట్టారు. మెప్మా అధికారుల అలసత్వం.. బ్యాంకర్ల నిర్లక్ష్యంతో లింకేజీ రుణాలను ఆర్పీలు సులువుగా తీసుకుని వెనకేసుకున్నారు. మహిళలకు తెలియకుండానే సదరు ఆర్పీలు సంఘాలను ఏర్పాటు చేసి, రుణాలు తీసుకోవడంతో వాటి రికవరీ బ్యాంకర్లకు తలనొప్పిగా మారింది. మూడేళ్ల నుంచి మహిళలకు నోటీసులు జారీ చేస్తున్నా తిరుగు సమాధానం లేకపోవడం, నోటీసులు అందుకున్న కొందరు అసలు తాము రుణాలే తీసుకోలేదని ఎదురుతిరగడంతో ఆర్పీల మోసం బయటపడింది. అయితే, రుణాలు కాజేసిన ఆర్పీలను మెప్మా అధికారులు తొలగించినప్పటికీ వారు తీసుకున్న సొమ్ము ఎలా రికవరీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
రెండు బ్యాంకుల నుండే..
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మహిళా సంఘాలకు పలు బ్యాంకుల నుండి లింకేజీ రుణాలు ఇస్తుంటారు. అయితే ఇద్దరు ఆర్పీలు అటు మహిళలు, ఇటు బ్యాంకర్లను మోసం చేసి కేవలం రెండు ప్రైవేట్ బ్యాంకుల నుంచే రుణాలు తీసుకున్నారని తెలుస్తోంది. ఓ బ్యాంక్‌లో ఎనిమిది, మరో బ్యాంకులో ఆరు సంఘాల పేరిట ఒక్కో సంఘం తరఫున రూ.15 లక్షల వరకు రుణాలు డ్రా చేసినట్లు తెలిసింది. ఈ సమయంలో బ్యాంకర్లు డాక్యుమెంట్లు సక్రమంగా చూడకుండానే రుణాలు మంజూరు చేయడం గమనార్హం. కోవిడ్ కాలం 2021లో ఈ రుణాలను బ్యాంకర్లు మంజూరు చేయగా.. నాటి నుండి రికవరీ కోసం మహిళలకు నోటీసులు జారీ చేస్తున్నారు. కానీ రుణాలతో సంబంధం లేని తమకు నోటీసులు రావడంతో పలువురు మహిళలు మెప్మా అధికారులు, బ్యాంకర్లను కలవగా గతేడాది ఆర్పీలను తొలగించినప్పటికీ రికవరీ మాత్రం మొదలుకాలేదు.
మరోసారి నోటీసులు
పలువురు మహిళలకు తీసుకున్న రుణాలు చెల్లించాలని ఇటీవల బ్యాంకర్లు మరోసారి నోటీసులు ఇవ్వడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై మెప్మా అధికారులు పట్టించుకోకపోడవంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తమ ప్రమేయం లేకుండా తప్పుడు పత్రాలతో రుణాలు కాజేసిన ఆర్పీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పోలీసులు ఓ ఆర్పీని తీసుకురావడంతో పెద్దల మధ్య పంచాయితీ పెట్టారని కేఎంసీలో చర్చ జరుగుతోంది.
అసలు ఎలా సాధ్యమైంది?
మహిళా సంఘాల సభ్యులను చూడకుండా, వారితో సంతకాలు చేయించకుండా ఏ బ్యాంకు రుణాలను మంజూరు చేయదు. అలాంటిది రెండు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా ఆర్పీలు ఎలా రుణాలు తీసుకున్నారనే ప్రశ్నకు సమాధానం తెలియడం లేదు. రెండేళ్లుగా ఈ మోసంపై చర్చ జరుగుతున్నా సమస్య మూలాలపై బ్యాంకర్లు, మెప్మా అధికారులు వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. ఆర్పీలు, బ్యాంకర్లకు ఉన్న సత్సంబంధాలతోనే రుణాలను కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు బ్యాంకుల్లోనే ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రికవరీ అయ్యేనా..
రుణం చెల్లించాలని బ్యాంకర్లు 140మంది మహిళలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఇందులో కొందరికి పంపిన నోటీసులు తిరిగి వస్తుండగా.. మరికొందరు మాత్రం తీసుకుని తమకేం సంబంధం లేదని అధికారుల ఎదుట వాపోతున్నారు. ఇంకొందరికి జారీ చేసే నోటీసులు తిరిగి వస్తుండడంతో తప్పుడు చిరునామాలు పొందుపర్చినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు కారణాలు, బాధ్యులు ఎవరైనప్పటికీ రుణ నగదును రికవరీ ఎలా చేస్తారన్న ప్రశ్నకు సమాధానం మాత్రం ఏళ్లు గడుస్తున్నా లభించడం లేదు.