
తొలకరి పలకరింపు
● రుతుపవనాల ముందస్తు ప్రభావం ● దుక్కులు, పచ్చిరొట్ట సాగుకు అనువైన వాతావరణం ● సన్నాహాల్లో నిమగ్నమైన అన్నదాతలు
ఖమ్మంవ్యవసాయం: తొలకరికి వేళయింది. సాధారణంగా జూన్ 1నాటికి కేరళను తాకే నైరుతి రుతుపవనాలు 6, 7వ తేదీకల్లా తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తాయి. కానీ ఈసారి ముందుగానే రుతుపవనాలు రానున్నాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యాన.. ఆ ప్రభావం అప్పుడే మొదలైంది. దీంతో బుధవారం వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల రెండో వారం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మూడో వారం నుంచి తగ్గుముఖం పట్టాయి. 40–45 డిగ్రీల మధ్య నమోదైన ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 32–37 డిగ్రీలకే పరిమితమవుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా, మధ్యాహ్నం 12గంటల తర్వాత నుంచి జిల్లావ్యాప్తంగా జల్లులు మొదలయ్యాయి. బాణాపురంలో 20.3 మి.మీ.ల వరపాతం నమోదు కాగా, ఖమ్మం ఖానాపురంలో 16.3, కూసుమంచిలో 15.3, వైరా ఏఆర్‌ఎస్ వద్ద 8.8, ముదిగొండ, మధిరలలో 7.5, నాగులవంచలో 6.8, చింతకానిలో 6.3, మధిర ఏఆర్‌ఎస్ వద్ద 5.5, బచ్చోడు, తిరుమలాయపాలెంలో 5 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.
సాగుకు అన్నదాతలు సమాయత్తం
గత నెల, ఈనెల కురిసిన అకాల వర్షాలతో రైతులు దుక్కలు సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. యాసంగిలో సాగు చేసిన పత్తి, మిరప వ్యర్థాలను తొలగించి వర్షాలు అదునుగా ఉన్న చోట దుక్కులు దున్నుతున్నారు. ఇక జిల్లాలో ప్రధాన పంటలైన వరి 2.95 లక్షల ఎకరాలు, పత్తి 2.13 లక్షల ఎకరాలు, మిరప 71 వేల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేసిన అధికారులు అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు సమకూర్చడంపై దృష్టి సారించారు. ముందుగా పత్తి విత్తనాలు అందుబాటులోకి తీసుకొస్తుండగా, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ సైతం పెసర, మినుము, కంది వంటి విత్తనాలను సిద్ధం చేయడంలో నిమగ్నమైంది.
ఇదే అదును
ప్రస్తుత వాతావరణం దుక్కులు చేసుకోవడంతో పాటు పచ్చిరొట్ట విత్తనాలు వేసేందుకు అనుకూలిస్తుందని అధికారులు చెబుతున్నారు. మాగాణి భూముల్లో పిల్లి పెసర, జీలుగు వేసుకుని భూసారా న్ని పెంచుకోవచ్చు. విత్తనాభివృద్ధి సంస్థ 50 శాతం సబ్సిడీపై జీలుగు, జనుము పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే, మిరప సాగు భూముల్లో పెసర పంట సాగుకు ప్రస్తుతం అనువుగా ఉందని చెబుతున్నారు. దీంతో రైతులు విత్తనాలు సమకూర్చుకోవడంపై దృష్టిసారించారు.
వ్యవసాయ పనులకు అనువుగా..
నైరుతి రుతుపవనాల ముందస్తు ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమై వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇప్పుడు పంటల సాగుకు అనుకూలంగా దుక్కులు చేసుకోవచ్చు. పచ్చి రొట్ట విత్తనాలను వేసుకోవచ్చు. 60 – 70 మి.మీ.ల వర్షపాతం నమోదైతేనే విత్తనాలు వేసేందుకు అనువుగా ఉంటుంది.
– డాక్టర్ రవికుమార్, కోఆర్డినేటర్,
కృషి విజ్ఞాన కేంద్రం, వైరా