
భూసర్వేతో సమస్యలకు శాశ్వత పరిష్కారం
● రైతులంతా సహకరిస్తే త్వరగా ప్రక్రియ పూర్తి ● ములుగుమాడు సదస్సులో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్
ఎర్రుపాలెం: భూముల సమగ్ర సర్వే ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఎర్రుపాలెం మండలం ములుగుమాడు రెవెన్యూ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున రైతులు సహకరించాలని సూచించారు. గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వేను బుధవారం కలెక్టర్ తనిఖీ చేయడంతో పాటు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సదస్సులో మాట్లాడారు. 1930లో భూ సర్వే జరగగా, ఇప్పుడు భూభారతి చట్టం ప్రకారం భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు సర్వే మ్యాప్ జత చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం లైసెన్స్‌డ్ సర్వేయర్ల ద్వారా సర్వే చేయిస్తున్నామని తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేశాక, నివేదికలను గ్రామంలో ప్రదర్శిస్తామని.. ఆపై అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరించాక శాశ్వత గ్రామ భూరికార్డు రూపొందిస్తామని కలెక్టర్ వివరించారు. తద్వారా నక్షా సిద్ధమవుతుందని, భూములు కుంటల్లోకి మారి కచ్చితమైన సరిహద్దులు వెల్లడవుతాయని తెలిపారు. ఈసమావేశంలో తహసీల్దార్ ఎం.ఉషాశారద, ఏడీ సర్వే శ్రీనివాసులు, ఆర్‌ఐ రవికుమార్, సర్వేయర్ రాజశేఖర్ తదితరులున్నారు.
ఆడపిల్లే ఇంటికి మహాలక్ష్మి
వైరారూరల్: ఆడపిల్ల పుడితే భారంగా కాకుండా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లు భావించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. వైరా మండలం రెబ్బవరంలో గుత్తా ఉషారాణి – సాయిప్రణీత్ దంపతులు ఇటీవల ఆడపిల్లకు జన్మనివ్వగా ‘మా పాప – మా ఇంటి మణిదీపం’ కార్యక్రమంలో భాగంగా వారిని కలెక్టర్ సన్మానించి సర్టిఫికెట్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మాయిలు అన్నిరంగాల్లో అబ్బాయిలతో సమానంగా ఎదుగుతున్న నేపథ్యాన సమాన అవకాశాలు కల్పించాలని తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె.రాంగోపాల్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కస్తాల సత్యనారాయణ, వైరా తహసీల్దార్ కే.వీ.శ్రీనివాసరావు, ఎంపీడీఓ పి.సరస్వతి, ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

భూసర్వేతో సమస్యలకు శాశ్వత పరిష్కారం