
భద్రాచలం.. కాషాయవర్ణం
● నేడు హనుమజ్జయంతి.. భద్రగిరికి బారులుదీరిన మాలధారులు ● శ్రీరామనవమి తరహాలో భక్తులు వస్తున్నా అరకొర ఏర్పాట్లతోనే సరి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జై శ్రీరామ్ నామస్మరణలతో మార్మోగే భద్రగిరి వీధుల్లో ఇప్పు డు ‘రామభక్త హనుమాన్‌కీ జై’ నినాదాలు వినిపిస్తున్నాయి. హనుమాన్ జయంతిని గురువారం జరు పుకోనుండగా, తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయస్వామి మాల ధరించిన భక్తులు భద్రాచలం చేరుతున్నారు. దీంతో పట్టణం, ఆలయ ప్రాంగణం, గోదావరి తీరం కాషాయవర్ణాన్ని సంతరించుకున్నాయి.
దశాబ్ద కాలంగా..
భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం వందల ఏళ్లుగా అంగరంగ వైభవంగా సాగుతోంది. అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, ఆ ముందురోజు తెప్పోత్సవం సైతం కనులపండువగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు భద్రాచలం వస్తుండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అయితే దశాబ్ద కాలంగా హనుమాన్ జయంతి సందర్భంగా కూడా భక్తుల తాకిడి పెరుగుతోంది.
అంజన్న భక్తులకు సవాలే..
శ్రీరామనవమి, ముక్కోటి పండుగల తరహాలోనే హనుమాన్ జయంతికి కూడా వేలాదిగా భక్తులు వస్తున్నా ఆ స్థాయిలో ఏర్పాట్లులేక ఇబ్బంది పడుతున్నారు. మాల ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా వచ్చే భక్తులకు సవాల్ ఎదురవుతోంది.
ప్రణాళిక అవసరం..
వేలాదిగా భక్తులు వచ్చే హనుమాన్ జయంతి పర్వదినం రోజున ప్రత్యేక ఏర్పాట్లపై అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. అదనపు క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లతోనే సరిపెడుతుండగా ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మాల విరమణ కోసం భద్రా చలం వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్నందున శబరిమల తరహాలో ఏర్పాట్లు చేయాల్సిన అవసరముంది. ఆలయంతో పాటు జిల్లా అధికా రులు ఈ విషయమై దృష్టి సారించి భక్తులు ఇబ్బంది పడకుండా డార్మిటరీలు, తాగునీరు వంటి అదనపు సౌకర్యాలు, మాల విరమణకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు, భజన మందిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే, శ్రీరామ నవమి తరహాలోనే ఈ ఏర్పాట్లపై మంత్రుల స్థాయిలో సమీక్ష జరపాలనే సూచనలు వస్తున్నాయి.