కొణిజర్ల: అక్రమంగా తరలిస్తున్న సుమారు 500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్, సివిల్ సప్లయీస్ అధికారులు కొణిజర్ల మండలం తనికెళ్లలో స్వాధీనం చేసుకున్నారు. తనికెళ్లలోని ఓ దాబా సమీపాన గురువారం రెండు లారీలు నిలిపారనే సమాచారంతో సివిల్ సప్లయీస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీలు అంజయ్య, యాదయ్య, సీఐ వసంత్‌కుమార్ చేరుకుని తనిఖీ చేయగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు తేలింది. దీంతో రెండు లారీలను కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఓ లారీ డ్రైవర్, ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన గజరావు గోపీ ఏన్కూరు సమీపాన బొలేరో వాహనాల ద్వారా తీసుకొచ్చిన 485 సంచుల బియ్యాన్ని లారీలో లోడ్ చేశాడని తేలింది. అలాగే, మరో డ్రైవర్ ఖమ్మం ప్రకాశ్‌నగర్‌కు చెందిన బి.రాము అదే ప్రాంతం నుంచి 600 సంచుల్లో తరలిస్తుండగా, పెద్దపల్లి జిల్లాకు తీసుకెళ్లాలన్న సమాచారంతో తనికెళ్ల సమీపంలోని దాబాకు వద్దకు చేరుకున్నామని అంగీకరించారు. అయితే, డ్రైవర్ల వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో లారీలను సీజ్ చేశారు. అనంతరం సివిల్ సప్లయీస్ డీటీ ఎం.వెంకటేశ్వర్లు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సూరజ్ తెలిపారు. తనిఖీల్లో ఆర్‌ఐ కిరణ్‌కుమార్, చెకింగ్ ఇన్‌స్పెక్టర్ నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లాకు తరలించే క్రమాన సీజ్