భద్రగిరికి కల్యాణ శోభ | - | Sakshi
Sakshi News home page

భద్రగిరికి కల్యాణ శోభ

Apr 17 2024 12:35 AM | Updated on Apr 17 2024 12:35 AM

- - Sakshi

భద్రాచలంలో నేడు సీతారాముల కల్యాణం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీరామ నవమి రోజున ఆగమ శాస్త్ర పద్ధతిని అనుసరిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేలాది ఆలయాలు, మండపాల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తుంటారు. వేలాది వేదికల్లో సీతారాముల కల్యాణం జరిగినా.. అందులో ప్రత్యేకమైనది, విశిష్టమైనది భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో నేడు జరగనున్న వేడుక. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి కాగా, భద్రగిరి కల్యాణ శోభను సంతరించుకుంది.

ఏడడుగుల వేడుక ఇలా..

ఉదయం 9:30 గంటల తర్వాత జనక మహారాజు పుత్రిక సీతమ్మ వారు, దశరథ మహారాజు జ్యేష్ఠ పుత్రుడు రామచంద్రస్వామి వివాహవేడుక పనులు ప్రారంభమవుతాయి. శంకు, చక్ర, ధనుర్బాణాలను ధరించి సీతమ్మతో కూడిన రాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో తీసుకొచ్చి మిథిలా స్టేడియంలోని వేదికపై వేంచేపు చేస్తారు. కల్యాణ వేడుకలకు ఎలాంటి విఘ్నాలు రాకుండా విశ్వక్సేన పూజ నిర్వహిస్తారు. పుణ్యావాచన మంత్రాలను పఠిస్తూ కల్యాణానికి ఉపయోగించే స్థలం, వస్తువులు, ప్రాంగణాన్ని సంప్రోక్షణ చేస్తారు. వేడుకలో పాల్గొనే వారిని మంత్ర జలంతో శుద్ధి చేస్తారు.

రాముడి ఎదురుగా సీతమ్మ

శ్రీయోద్వాహము నిర్వహించి అప్పటి వరకు మండపంలోనే ఉన్న సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చుండబెడతారు. అర్చకులు సీతారాముల వంశగోత్రాల ప్రవరలు చదువుతారు. ఆ తర్వాత ద్వాదశ దర్భలతో తయారు చేసిన యోక్త్రంతో సీతమ్మకు బంధనం చేస్తారు. మరోవైపు శ్రీరాముడు గృహస్థ ఆశ్రమంలోకి వెళ్తున్నాడనే దానికి సూచనగా యజ్ఞోపవీతధారణ చేస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం శ్రీరాముడికి పాదప్రక్షాళణ చేసి, వరపూజ నిర్వహిస్తారు.

రామదాసు చేయించిన ఆభరణాలతో..

కల్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను సీతారాములకు ధరింపజేస్తారు. అనంతరం రామదాసు చేయించిన చింతాకు పతకం సీతమ్మకు, పచ్చలహారం రామయ్యకు అలంకరిస్తారు. లక్ష్మణుడికి రామమాడ ధరింపజేస్తారు. ఆ తర్వాత సీతారాములకు తేనే, పెరుగు కలిపిన మధుపర్కంతో నివేదన చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం, శృంగేరీ పీఠం, రామదాసు, తూము నర్సింహదాసు వంశీయుల తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

కన్యాదానం..

వేదమంత్రాలు పఠిస్తూ కన్యాదానాన్ని పురస్కరించుకుని భూ, గోదానం చేస్తారు. అనంతరం మహా సంకల్పం, చూర్ణిక పఠిస్తారు. శ్రీరాముడు, సీతమ్మ లకు సంబంధించి చెరో ఎనిమిది శ్లోకాలను పఠిస్తా రు. మంగళాష్టకాల్లో వధూవరులకు సంబంధించి ఏడు తరాల వివరాలు, ఘనతను తెలియజేస్తారు.

అభిజిత్‌ లగ్నంలో..

చైత్రశుద్ధ నవమి రోజున అభిజిత్‌ లగ్నంలో శ్రీరాముడి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. మధ్యాహ్నం 12 గంటలకు ముహూర్త సమయం కాగానే సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచుతారు. తర్వాత రామదాసు చేయించిన మూడు బొట్ల మంగళసూత్రానికి ప్రత్యేకపూజలు చేసి, సీతమ్మ వారి మెడలో వేస్తారు.

తలంబ్రాల వేడుక..

ముత్యాలు కలిపిన, భక్తులు గోటితో ఒలిచిన తలంబ్రాలను సీతారాములపై పోస్తారు. సాధారణంగా తలంబ్రాలు పసుపు రంగులో ఉంటాయి. కానీ ఇక్కడ గులాబీ రంగులో ఉంటాయి. ఇక్కడ తలంబ్రాల తయారీలో పసుపుతో పాటు గులాల్‌ను కూడా ఉపయోగించడం తానీషా కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది.

అలరించిన ‘ఎదుర్కోలు’

భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో కీలక ఘట్టమైన ఎదుర్కోలు వేడుక మంగళవారం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. గరుత్మంతుడి వాహనంపై స్వామివారిని మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న వైకుంఠద్వారం వద్దకు తీసుకొచ్చి కొలువుదీర్చారు. అక్కడ ‘మా వంశం గొప్పదంటే.. కాదు మా వంశమే గొప్ప’ అంటూ కొందరు అర్చకులు సీతమ్మ తరఫున, మరి కొందరు రామయ్య వైపు చేరి సంవాదం చేసుకోవడం రక్తి కట్టించింది. శ్రీ సీతారాముల వారి వైభవాన్ని లోకానికి తెలియజెప్పేందుకే ఎదుర్కోలు వేడుక నిర్వహిస్తామని పండితులు తెలిపారు. ఆ తర్వాత ఊరేగింపుగా స్వామి, అమ్మవార్లను ఆలయానికి తీసుకెళ్లారు. కాగా రామచంద్రస్వామి తరఫున దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, సీతమ్మ వారి తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ ప్రియాంక ఆల, ఎస్పీ రోహిత్‌రాజ్‌, ఈఓ రమాదేవి, స్థానా చార్యులు కేఈ స్థలశాయి, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, ప్రధాన అర్చకులు విజయరాఘవన్‌, పొడిచేటి సీతారామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

పల్లకీలో ఆలయం నుంచి

మిథిలా స్టేడియానికి..

ఉదయం 10 గంటలకు

కల్యాణ క్రతువు ప్రారంభం

సింహాసనంపై శ్రీరాముడు,

గజాసనంపై సీతమ్మ తల్లి

రామదాసు ఆభరణాలతో

వధూవరుల అలంకరణ

మధ్యాహ్నం 12 గంటలకు

అభిజిత్‌ లగ్నంలో జీలకర్ర బెల్లం

ఎదుర్కోలు వేడుకకు హాజరైన భక్తులు1
1/3

ఎదుర్కోలు వేడుకకు హాజరైన భక్తులు

2
2/3

మాలమార్పిడి నృత్యం చేస్తున్న అర్చకులు3
3/3

మాలమార్పిడి నృత్యం చేస్తున్న అర్చకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement