
మాట్లాడుతున్న సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు, పక్కన తమ్మినేని, నాయకులు
● ఓటమి భయంతోనే ఈడీ, సీబీఐ దాడులు ● సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు
ఖమ్మంమయూరిసెంటర్: గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, ఎన్డీఏ కూటమిని గద్దె దించడమే ప్రధాన అజెండాగా లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం, ఇండియా కూటమి ముందుకెళ్తోందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు తెలిపారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఆయన మాట్లాడారు. దేశాన్ని మోదీ ప్రభుత్వం ప్రమాదకరస్థాయికి తీసుకెళ్లిందని, అదే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజ్య స్వభావమే పూర్తిగా మారిపోతుందని తెలిపారు. అందుకే ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించాలని మార్కిస్టు పార్టీ నిర్ణయించిందన్నారు. అయితే, మోడీ, కార్పొరేట్ శక్తులు దేశంలో కృత్రిమ వాతావరణాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని, అత్యధిక సీట్లు వస్తాయని అనుకూల కార్పొరేట్ మీడియా సంస్థల ద్వారా ప్రచారం చేయించుకోవడమే కాక ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పెరిగాయని చెప్పిస్తున్నా ఇందులో వాస్తవం లేదన్నారు. గెలుస్తామని విశ్వాసం ఉంటే ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, హేమంత్ సోరైన్ లాంటివారిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటని వారు ప్రశ్నించారు. బీజేపీకి ప్రమాదకరంగా ఉన్న వారిపై ఈడీతో దాడులు చేయిస్తోందని విమర్శించారు. కాగా, ఈ దేశంలో ఎన్నికల బాండ్లు తీసుకోని ఏకై క పార్టీ సీపీఎం మాత్రమేనని, నీతి, నిజాయితీ అంటూ మాట్లాడే బీజేపీ మాత్రం అత్యధికంగా బాండ్లు తీసుకుందని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగ మౌలిక విలువలను రక్షించుకునేందుకు జరుగుతున్న పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణలోనూ బీజేపీ ప్రమాదం ముంచుకొస్తోందని, మతోన్మాద వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్రంలో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవకూడదనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. ఇక కాంగ్రెస్‌ను లౌకిక పార్టీగా అంగీకరిస్తున్నామే తప్ప ఆ పార్టీపై మోజేమీ లేదని రాఘవులు చెప్పారు. అయితే, తెలంగాణలో ఆ విజ్ఞత కాంగ్రెస్‌కు లేదని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, ఎర్రా శ్రీకాంత్, పొన్నం వెంకటేశ్వర్లు, బొంతు రాంబాబు, వై.విక్రమ్, కళ్యాణం వెంకటేశ్వర్లు, చింతలచెర్వు కోటేశ్వరరావు, బుగ్గవీటి సరళ, మాచర్ల భారతి, భూక్యా వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
‘అలుపెరుగని పోరాటం’ పుస్తకావిష్కరణ
నాటి ఎమర్జెన్సీని మించి నిరంకుశ విధానాలను బీజేపీ అవలంభిస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సి ఉందని తెలిపారు. ఈమేరకు ప్రబీర్ పుర్కాయస్థ రచించిన ‘అలుపెరుగని పోరాటం’ పుస్తకాన్ని శనివారం ఆయన ఖమ్మంలో ఆవిష్కరించి మాట్లాడారు. ప్రస్తుతం ఉపా చట్టం కింద జైలు జీవితం గడుపుతున్న ప్రబీర్... ఎంత కష్టాన్నయినా ఓ విప్లవకారుడు ఎలా ఎదుర్కొంటాడో ఈ పుస్తకం ద్వారా పరిచయం చేశారని వివరించారు. కాగా, కాంగ్రెస్, బీజేపీల అధికార మార్పిడి జరిగిందే తప్ప జైళ్లు, నిర్బంధాలు మారలేదని తెలిపారు. రచయిత ఆనందాచారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఎం, సీపీఐ, ఎన్‌డీ నాయకులు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, పోటు ప్రసాద్, మందుల రాజేంద్రప్రసాద్, విద్యావేత్త రవి మారుత్, డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, జేఎన్‌యూ పూర్వ విద్యార్థి నెల్లూరు నరసింహారావు, విజయ్, మాచర్ల భారతి తదితరులు పాల్గొన్నారు.