
లడ్డూలు తయారు చేస్తున్న సిబ్బంది
● శరవేగంగా లడ్డూలు, ముత్యాల తలంబ్రాల తయారీ ● నేడు గరుడ ధ్వజపటలేఖనం, గరుడధ్వజాధివాసం ● కలెక్టరేట్‌లో వీవీఐపీ, వీఐపీ టికెట్ల విక్రయం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యాన శ్రీరామనవమి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో శ్రీ సీతారాముల కల్యాణం, మరుసటి రోజు పట్టాభిషేక మహోత్సవం జరగ నుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే భద్రాచలంలో మూడు దిక్కుల, సారపాక, మోరంపల్లి బంజర్‌తో పాటు పలు గ్రామాల్లో భక్తులకు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. కల్యాణం జరగనున్న మిథిలా స్టేడియం, వైకుంఠ ద్వారం, దేవస్థానాన్ని పంచరంగులతో తీర్చిదిద్దారు. వీవీఐపీ, వీఐపీ, ఉభయదాతలు, ఇతర సెక్టార్లలో చలువ పందిళ్ల నిర్మాణం పూర్తికాగా, చాందినీ వస్త్రాలతో అలంకరిస్తున్నారు. దేవస్థానంతోపాటు పట్టణంలో పలు చోట్ల విద్యుత్ దీపాలతో అలంకరణ చేపట్టారు. ఏర్పాట్లపై కలెక్టర్ ప్రియాంక ప్రత్యేక దృష్టి సారించడంతో వివిధ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు.
2.5 లక్షల లడ్డూలు
శ్రీరామనవమి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం దేవస్థానం అధ్వర్యంలో లడ్డూల తయారీ ప్రారంభమైంది. తానీషా కల్యాణ మండపంలోని పైభాగంలో లడ్డూల తయారీ చేపట్టారు. గతేడాది రెండు లక్షల లడ్డూలను తయారు చేయగా, ఈ ఏడాది భక్తుల రాక పెరిగే అవకా శముందని భావిస్తున్న నేపథ్యంలో రెండున్నర లక్షల లడ్డూలను తయారీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు తగినట్లుగానే పంపిణీకి సైతం కౌంటర్లను పెంచనున్నారు.
నేడు గరుడ ధ్వజపటలేఖనం,
గరుడధ్వజాధివాసం
వసంత ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి సార్వభౌమ వాహన సేవ జరిగింది. యాగశాలలో మండల, కుండ, కలశ తదితర క్రతువులు నిర్వహించారు. ఇక ఆదివారం గరుడ ధ్వజపట లేఖనం, గరుడధ్వజాపటావిష్కరణ, గరుడధ్వజాధివాసం తదితర కార్యక్రమాలను ఆలయ అర్చకులు, పండితులు నిర్వహించనున్నారు.
వీవీఐపీ, వీఐపీ టికెట్ల అమ్మకం కలెక్టరేట్‌లో..
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ ఏడాది సీఎంతో పాటు ఇతర మంత్రులు నవమికి వచ్చే అవకాశం లేకపోవడంతో, సీఎం సెక్టార్‌ను వీవీఐపీ, వాటి వెనుక వీఐపీ సెక్టార్లుగా విభజించారు. ఇందులో వీవీఐపీలో సెక్టార్‌లో ఒక్కొక్కరు రూ. 10 వేల టికెట్‌తో 100 మంది, వీఐపీ సెక్టార్‌లో ఒక్కొక్కరు రూ. 5 వేల టికెట్‌తో 250 మంది వీక్షించేలా ప్రణాళిక రూపొందించారు. అయితే ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచకపోవడంతో, పలువురు సీఆర్‌ఓ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. చివరకు కలెక్టరేట్‌లో వీటిని విక్రయించనున్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు.
3.5 లక్షల తలంబ్రాల ప్యాకెట్లు
సీఆర్‌ఓ వెనుక భాగంలో ఉన్న టీటీడీ సత్రంలో ముత్యాల తలంబ్రాల తయారీ ప్రారంభించా రు. గతేడాది రెండున్నర లక్షల ప్యాకెట్లు సిద్ధం చేయగా, డిమాండ్‌ను బట్టి ఈసారి మూడు నుంచి మూడున్నర లక్షల ప్యాకెట్లను సిద్ధం చేయాలని అఽధికారులు భావిస్తున్నారు. భక్తులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు కలిపిన తలంబ్రాలను మిషనరీ సహాయంతో ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. గతేడాది తిరుపతికి చెందిన ఓ దాత రూ.1.40 లక్షల వ్యయంతో అందజేసిన మిషన్‌తో గంటకు 1,500 ప్యాకెట్ల చొప్పున ప్యాకింగ్ చేస్తున్నారు. దీంతో రోజుకు 25 వేల వరకు తలంబ్రాల ప్యాకెట్లు భక్తుల కోసం అందుబాటులోకి వస్తున్నాయి. గతేడాది లాగే రెండు ముత్యాలతో ఉన్న తలంబ్రాల ప్యాకెట్ రూ.30కే భక్తులకు, పోస్టల్ శాఖకు విక్రయించనున్నారు. ఇక ఆర్టీసీ మాత్రం గతేడాదికి మించి రూ.151 వసూలు చేస్తుండగా, దేవస్థానం ఒక్కో ప్యాకెట్‌ను ఆర్టీసీ కి రూ.50కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

సార్వభౌమసేవలో స్వామి వారు
Comments
Please login to add a commentAdd a comment