
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని పాఠశాలల్లో 1నుంచి పదో తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ–1 (సమ్మెటివ్ అసెస్‌మెంట్) పరీక్షలు ఈనెల 5నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ సోమశేఖరశర్మ, డీసీఈబీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పాఠశాలల్లో నిర్ణయించిన తేదీల ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కాగా, ప్రశ్నాపత్రాలను పాఠశాలల హెచ్‌ఎంలు మండల రిసోర్స్ సెంటర్ల నుంచి తీసుకెళ్లాలని తెలిపారు.
జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపికలు ప్రారంభం
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఆధ్వర్యంలో నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం ఎంపికలు ప్రారంభమయ్యా యి. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 100 మంది విద్యార్థులు ఎంపికలకు హాజరయ్యారు. జూనియర్, సీనియర్ బాలుర, బాలికల కేటగిరీల్లో ఎంపికలు నిర్వహించారు. అత్యంత ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి ఈనెల 16 నుంచి హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు పంపిస్తామని టీటీ జిల్లా కార్యదర్శి ఓలేటి సాంబమూర్తి తెలిపారు. అడవి మల్లెల, కూసుమంచి, తల్లాడ, నేలకొండపల్లి, టేకులపల్లి, దానవాయిగూడెం, ఖమ్మం పట్టణానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొని ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. సోమవారం తుది జట్లను ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఆనం రాజేష్, పరిటాల చలపతి, పీఈటీలు పాల్గొన్నారు.
సెర్ప్ ఉద్యోగుల సర్టిఫికెట్ల పరిశీలన
ఖమ్మంమయూరిసెంటర్ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలోని సెర్ప్ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది విద్యార్హత పత్రాలను అధికారులు ఆదివారం పరిశీలించారు. సెర్ప్‌లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం ఇటీవల పే స్కేల్ ప్రకటించగా.. హెచ్‌ఆర్ పాలసీ ద్వారా పే స్కేల్ అందుకుంటున్న ఉద్యోగులు, సిబ్బంది విద్యార్హత సర్టిఫికెట్లు పరిశీలించాలని రాష్ట్ర అధికారులు డీఆర్‌డీఓను ఆదేశించారు. ఈ క్రమంలో ఖమ్మం టీటీడీసీ భవనంలో ఐదుగురు డీపీఎంల ఆధ్వర్యంలో 180 మంది ఒరిజినల్ ధ్రువపత్రాలను పరిశీలించారు. వీటిని సేకరించిన అధికారులు ఈనెల 4వ తేదీ వరకు హైదరాబాద్ సెర్ప్ కార్యాలయానికి పంపించనున్నారు. అక్కడ మరోసారి పరిశీలించి, పే స్కేల్‌కు అర్హులా.. కాదా తేల్చనున్నారు. అడిషనల్ డీఆర్‌డీఓ జయశ్రీ పర్యవేక్షించారు.
ఉద్యోగులను
యాజమాన్యం వేధిస్తోంది
ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ఆరోపణ
ఖమ్మంవ్యవసాయం: ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తోందని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్(టీఈఈఏ) అధ్యక్షులు ఎన్.శివాజీ, కార్యదర్శి రామేశ్వర శెట్టి ఆరోపించారు. అసోసియేషన్ సమావేశం ఆదివారం ఖమ్మంలోని విద్యుత్ గెస్ట్‌హస్‌లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్న చిన్న కారణాలు చూపుతూ యాజమాన్యం పనిష్‌మెంట్ల పేరుతో వేధిస్తోందన్నారు. ఆధారాలు లేని లేఖలపై పనిష్‌మెంట్ ఇవ్వొద్దని సీవీసీ ఆదేశాలు ఉన్నా.. యాజమాన్యం వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలోనూ అన్యాయం జరుగుతోందని వాపోయారు. ఖాళీల భర్తీకి అర్హులైన వారు ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. సమావేశంలో నాయకులు రవి, సంపత్‌రావు, బాబూనాయక్, ఎన్పీడీసీఎల్ కంపెనీ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, సంఘం జిల్లా కార్యదర్శి వై.రమేష్‌కుమార్, ఎన్. రామారావు, నాగేశ్వరరావు, రాధాకృష్ణ, రామదాస్, సత్యనారాయణ, రామ్ రెడ్డి, శంకర్, శ్రీనివాసరావు, మనోహర్, అనంతప్రకాష్, రవికుమార్ పాల్గొన్నారు.


ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న అధికారులు