
లబ్ధిదారులకు గృహలక్ష్మి పత్రాలు పంపిణీ చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మంమయూరిసెంటర్ : రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగరంలోని 3, 15, 23, 27, 28, 35, 51, 53, 54, 57 డివిజన్లలో మంజూరైన గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలను 158 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. జీఓ నం. 58 ద్వారా 2014 నుంచి 2020 వరకు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఉన్న పేద వారికి వేల సంఖ్యలో హక్కు పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు. స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు వెంటనే నిర్మాణం చేపట్టాలని, మూడు విడతలుగా రూ.లక్ష చొప్పున అందిస్తామని వివరించారు.
అభివృద్ధికి గుమ్మంగా ఖమ్మం..
ఖమ్మం నగరాన్ని అభివృద్ధికి గుమ్మంగా తీర్చిదిద్దామని, నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి డివిజన్‌లో రహదారులు, డ్రెయినేజీలు, పార్కులు, జంక్షన్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని మంత్రి పువ్వాడ అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో పలు డివిజన్లలో రూ.1.47 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రజల విజ్ఞప్తి మేరకు ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేశామని చెప్పారు. కనీసం నడవడానికి కూడా సరైన రోడ్డు మార్గం లేని పరిస్థితుల నుంచి నేడు అన్ని ప్రధాన రహదారులు విస్తరించి సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్‌లు ఏర్పాటు చేసి, అన్ని గల్లీల్లో అత్యాధునిక టెక్నాలజీతో నాణ్యమైన సీసీ రోడ్లు నిర్మించామని, ప్రజా రవాణాను మెరుగు పరిచామని చెప్పారు. వీటితో పాటు ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన తాగునీరు అందించామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ కమిషనర్ మల్లీశ్వరి, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్ మందడపు లక్ష్మి, కమర్తపు మురళి, పగడాల శ్రీవిద్య, ఎస్‌కె.మక్బుల్, మేడారపు వెంకటేశ్వర్లు, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, ఏసీపీ గంటా వెంకట్రావు, జి. శ్రీనివాస్, కాటా సత్యనారాయణ బాబ్జీ, కమర్తపు సరిత, సుజాత, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మా రాజేశ్వరరావు, తోట ఉమరాణి వీరభద్రం, రుద్రగాని శ్రీదేవి ఉపేందర్ పాల్గొన్నారు.
వయోవృద్ధుల సంక్షేమానికి కృషి
ఖమ్మం మామిళ్లగూడెం : వయోవృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఆదివారం ఖమ్మం జెడ్పీ మీటింగ్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. వయోవృద్ధులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి తాళ్లూరి సుమ, డాక్టర్ రవిచంద్ర, వయోవృద్ధుల సంఘం జిల్లా అధ్యక్షుడు వి.చంద్రమోహన్, అసోసియేట్ అధ్యక్షుడు ఆర్. రవీందర్‌రావు, ప్రధాన కార్యదర్శి జనార్దన్ రావు, కార్యదర్శి అనాశి కృష్ణ, ఉపాధ్యక్షుడు శ్రీహరి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కల్యాణం కృష్ణయ్య, సుబ్బయ్య, నగర అధ్యక్షుడు మారంరాజు రాధాకృష్ణారావు, హనుమంతరావు, టి.జనార్దన్‌రావు పాల్గొన్నారు.
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
158 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి పత్రాలు పంపిణీ