
● నిధుల కోసం మహిళల ఎదురుచూపులు ● నగదు తిరిగిస్తామని చెప్పి ఏడాదిన్నర.. ● ప్రభుత్వం విడుదల చేస్తే ఉమ్మడి జిల్లాలో 2.14 లక్షల మంది సభ్యులకు లబ్ధి
ఖమ్మంమయూరిసెంటర్ : స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉంటూ.. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల కోసం మహిళలు అభయహస్తం పథకానికి డబ్బులు చెల్లించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసి మహిళా సభ్యుల పిల్లల చదువులకు ఉపకార వేతనాలు, వృద్ధాప్యంలో పింఛన్‌తో పాటు ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయం అందజేశారు. తక్షణ సాయంగా అంత్యక్రియలకు రూ.5 వేలు ఇచ్చేవారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం, తెలంగాణలో కొత్త ప్రభుత్వ పాలన ప్రారంభమైన తర్వాత ఈ పథకాన్ని నిలిపివేసింది. అయితే అప్పటివరకు అభయహస్తం కింద నగదు చెల్లించిన మహిళలు తాము చెల్లించిన నగదును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో గతేడాది మార్చిలో అభయహస్తం కింద నగదు చెల్లించిన మహిళలను గుర్తించి, వారికి నగదు తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,14,987 మంది ఈ పథకానికి నగదు చెల్లించారు.
పథకం ప్రారంభం ఇలా..
అభయహస్తం పథకాన్ని 2009లో ప్రారంభించగా.. స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా ఉండి 18 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలను అర్హులుగా గుర్తించారు. పొదుపు సంఘాల్లోని సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మహిళా సభ్యులు ఏటా రూ.365 చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం రూ.360 జమ చేస్తుండేది. జమ చేసిన డబ్బుతో 60 ఏళ్లు నిండిన తర్వాత అభయహస్తం పథకం పింఛన్‌గా ప్రతినెలా రూ.500 చొప్పున ఐదేళ్ల పాటు చెల్లించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం, ప్రభుత్వం మారడం, రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్‌ను రూ.2,016కు పెంచడంతో ఈ పథకం మూలన పడింది.
2,14,987 మంది సభ్యులకు..
అభయహస్తం కింద తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని చాలాకాలం నుంచి మహిళలు కోరుతున్నారు. మంత్రి మండలి ఉప సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు చెల్లించిన డబ్బులకు వడ్డీతో కలిపి ఇవ్వాలని గతేడాది మార్చిలో నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో 1,36,656 మంది, భద్రాద్రి జిల్లాలో 78,331 మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తంగా ఈ రెండు జిల్లాల వ్యాప్తంగా 2,14,987 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సభ్యులు, వారి బ్యాంక్ ఖాతా వివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
ఏడాదిన్నర అయినా..
అభయహస్తం పథకానికి నగదు చెల్లించిన మహిళలకు తిరిగి నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఏడాదిన్నర దాటినా నేటికీ తిరిగి చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తాము చెల్లించిన అభయహస్తం నిధులను తిరిగి వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.
వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశాం
అభయహస్తం పథకానికి మహిళా సభ్యులు చెల్లించిన నగదు, వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళల బ్యాంక్ ఖాతాల వివరాలను కూడా గతేడాది నమోదు చేశాం. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే మహిళల ఖాతాల్లో నేరుగా ఆ నగదు జమవుతుంది. – ఎం.విద్యాచందన, డీఆర్‌డీఓ
