
● మళ్లీ సీజనల్ జ్వరాల విజృంభణ ● డెంగీతో బెంబేలెత్తుతున్న జిల్లా వాసులు ● కిటకిటలాడుతున్న ఆస్పత్రులు ● భారీగా దండుకుంటున్న ప్రైవేటు యాజమాన్యాలు
ఖమ్మంవైద్యవిభాగం : జిల్లాలో సీజనల్ వ్యాధుల ప్రభావం మళ్లీ కనిపిస్తోంది. ప్రజలు వైరల్ ఫీవర్‌తో పాటు డెంగీ బారిన పడి అల్లాడుతున్నారు. జ్వరాలతో ఆస్పత్రుల బాట పడుతుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు కిటకిటలాడుతున్నాయి. జ్వరపీడితులు ఎక్కువగా వస్తుండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు సరిపోవడం లేదు. దీంతో కొద్దోగొప్పో ఆర్థిక స్తోమత ఉన్న వారు ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. గత వారం, పది రోజులుగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పడకలు సరిపోక ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురిని ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాక కింద కూడా పరుపులు వేసి మరికొందరికి చికిత్స అందిస్తున్నారు. ఈ సీజనల్‌లో మునుపెన్నడూ లేని విధంగా జ్వరపీడితులు వస్తుండడంతో ఖమ్మంలో ప్రభుత్వ ఆస్పత్రితో పాటు, ప్రైవేటు ఆస్పత్రులు కూడా పేషెంట్లతో నిండిపోతున్నాయి.
డెంగీ, వైరల్ ఫీవర్‌తో పరేషాన్..
సాధారణంగా ప్రతీ సీజనల్‌లో డెంగీతో పాటు మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్ వంటి జ్వరాలు వస్తుంటాయి. కానీ సీజన్ పూర్తవుతున్న ఈ సమయంలో జిల్లాలో డెంగీతో పాటు వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా వాతావరణంలో వచ్చిన మార్పులతోనే ఈ పరిస్థితి దాపురించిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇటీవల హఠాత్తుగా వర్షాలు రావడం, ఉక్కపోత వాతావరణం వంటి కారణాలతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. దీనికి తోడు పలు ప్రాంతాల్లో దోమల వ్యాప్తి పెరిగింది. వీటి బారిన పడిన ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 18,446 శాంపిల్స్ తీయగా 315 డెంగీ కేసులు వెలుగు చూశాయి. చికున్‌గున్యా, టైఫాయిడ్ ప్రభావం అంతగా లేకపోయినా, మలేరియా కేసులు 13 వచ్చాయి. సెప్టెంబర్ 1 నుంచి 29వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 222 డెంగీ కేసులు వెలుగు చూశాయంటే వాటి ప్రభావం ఏ మేరకు ఉందో తెలుస్తోంది. అలాగే ఈ ఏడాది 50,470 మందికి వైరల్ ఫీవర్స్ సోకగా, గత నాలుగు నెలల్లో 22,812 మంది జ్వరాల బారిన పడ్డారు. కరోనాకు ముందు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేవి. కానీ ఇప్పుడు కాలంతో పనిలేకుండా ఎప్పుడు సీజనల్ వ్యాధులు వస్తాయో అర్థ కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.
ప్రైవేటులో యథేచ్ఛగా దోపిడీ..
జిల్లాలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రితో పాటు ఏడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 26 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 7 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. జ్వర పీడితులు ఎక్కువ అవుతుండటంతో ప్రస్తుతం వాటిన్నింటిపైనా భారం పడింది. ఇంత ప్రభుత్వ వ్యవస్థ ఉన్నా బెడ్లు సరిపోక చాలా మంది ప్రైవేటు బాట పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం ఉండదని, ప్రైవేటులో అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయనే అపోహతో చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చేతి చమురు వదిలించుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పైసా ఖర్చు లేకుండా వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు ఉచితంగా వైద్యం పొందవచ్చు. అయితే ఇటీవల జ్వరపీడితులు భయం, ఆత్రుతతో ప్రైవేటు బాట పడుతున్నా రు. ఇది కొందరు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు వరంలా మారింది. జ్వరంతో ఆస్పత్రికి వెళితే పరీక్షల పేరుతో, ప్లేట్‌లెట్స్ తగ్గిపోయాయనే సాకుతో దందాకు తెరలేపారు. చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో త్వరగా నయం కాదనే భయంతో ఎంత ఖర్చయినా భరాయిస్తూ ఆర్థికంగా చితికి పోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై అపోహలు తొలగించి, మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేలా చూస్తే తప్ప ఈ పరిస్థితి మారేలా కనిపించడం లేదు.
వైరల్ ఫీవర్స్ ఇలా..
నెల కేసులు
జూన్ 5847
జూలై 6317
ఆగస్టు 5560
సెప్టెంబర్(29వరకు) 5088
గత నాలుగు నెలల్లో జిల్లాలో డెంగీ కేసుల వివరాలు
నెల టెస్టులు నమోదైన కేసులు
జూన్ 486 05
జూలై 1376 14
అగస్టు 4345 61
సెప్టెంబర్(29 వరకు) 7188 222

