
పార్వతి(ఫైల్)
● హత్యా? ప్రమాదమా? ● కేసు నమోదు చేసిన జీఆర్‌పీ పోలీసులు
ఖమ్మంక్రైం: ఖమ్మం నగరంలో శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మహిళ కేసు మిస్టరీగా మారింది. తొలుత వన్‌టౌన్ నుంచి ఖానాపురం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి చివరికి ఖమ్మం రైల్వే పోలీస్‌స్టేషన్‌కు చేరింది. వివరాలిలా ఉన్నాయి.. మయూరిసెంటర్‌లోని ఓవర్‌బ్రిడ్జి వద్ద కారు ఢీకొని తీవ్ర గాయాలపాలైన నేలకొండపల్లి మండలానికి చెందిన నాయిని పార్వతి (40)ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా మృతిచెందిందని నగర శివారు అగ్రహారానికి చెందిన నర్రా నాగేశ్వరారావు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారించిన పోలీసులు అతను అబద్ధం చెబుతున్నాడని తిరిగి అడగగా శ్రీరామ్‌హిల్స్ ప్రాంతంలో ప్రమాదం జరిగిందని, తాను తీసుకొచ్చిన ఆస్పత్రి వన్‌టౌన్ పరిధిలో ఉండటంతో ఇక్కడ కేసు పెట్టడానికి వచ్చానని చెప్పాడు. అనంతరం అతడు ఖానాపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈలోపు మృతురాలి భర్త రామారావు, కుటుంబ సభ్యులు చేరుకొని నాగేశ్వరరావు తన భార్యను చంపి ప్రమాదం జరిగిందని చెబుతున్నాడని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నాగేశ్వరరావుని అదుపులోకి తీసుకొని ఆరాతీశారు. పార్వతికి తనకు ముందే పరిచయం ఉందని, ఇద్దరం కలిసి అగ్రహారం సమీపంలో ఉన్న మూలమలుపు వద్ద రైలు పట్టాలు దాటుతుండగా పార్వతిని రైలు ఢీకొట్టిందని, ఆమెను శ్రీరామ్‌నగర్ గుండా రోడ్డుపైకి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందిందని నాగేశ్వరరావు చెప్పినట్లు తెలిసింది. భయంతో తాను రోడ్డుప్రమాదం అని చెప్పానని వివరించినట్లు సమాచారం. కాగా, తన భార్యను నాగేశ్వరరావు హత్య చేసి అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడని పార్వతి భర్త రామారావు జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా రైలు ఢీకొంటే లోకోపైలట్ వెంటనే సమాచారం అందిస్తాడని, తమకు అలాంటి ఫిర్యాదు అందలేదని, ఘటనా స్థలంలో రైలు పట్టాల వద్ద రక్తపు మరకలు కనిపించాయని, ఒకవేళ ఇదిహత్య కేసు అయితే ఖానాపురం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తామని జీఆర్‌పీ ఎస్‌ఐ భాస్కర్‌రావు తెలిపారు. కాగా, తమకు న్యాయం చేయాలంటూ పార్వతి కుటుంబసభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద ఆందోళన నిర్వహించారు.