
ఖమ్మంమయూరిసెంటర్: ‘ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఖాళీ స్థలాలతో సమస్య తలెత్తుతోందని గుర్తించి రెండేళ్లుగా ప్రత్యేక దృష్టి సారించాం. నగరంలోని ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగినా, నీరు నిలిచినా యజమానికి జరిమానా విధించి శుభ్రం చేయిస్తున్నాం. అయినా పలు చోట్ల స్థలాల యజమానులు అలసత్వం వహిస్తున్నారు. మురుగు నిలిచి, పిచ్చిమొక్కలు పెరిగిన ఖాళీ స్థలాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడమే కాక ప్రజలకు తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపిస్తాం’ అని కేఎంసీ డిప్యూటీ కమిషనర్ బి.మల్లీశ్వరి వెల్లడించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా సాగుతోందని, రోజు విడిచి రోజు ఇళ్ల నుండి వ్యర్థాల సేకరణ జరుగుతోందని తెలిపారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదుచేస్తే వెంటనే పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘సాక్షి’ ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన ‘ఫోన్ ఇన్’లో మల్లీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర వాసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఆమె... కొన్ని సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందిని పంపించారు. ఈ సందర్భంగా ఫోన్ ఇన్‌లో ప్రజలు అడిగిన ప్రశ్నలు, డీసీ ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి.
● 57వ డివిజన్ జగ్జీవన్‌రామ్ కాలనీకి వారానికోసారి కూడా చెత్త బండి రావడం లేదు. దీంతో చెత్త పేరుకుపోతోంది. బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు.
– రాంబాబు, 57వ డివిజన్, ఖాజా, శుక్రవారిపేట
జవాబు : రోజు విడిచి రోజు ప్రతీ డివిజన్‌లో చెత్త సేకరణ జరుగుతోంది. అలా రాకపోతే ఫిర్యాదు చేయొచ్చు. ప్రజలు కూడా వాహనాల సిబ్బందికే చెత్త ఇవ్వాలి తప్ప రోడ్ల వెంట వేయొద్దు.
● డ్రెయినేజీల నిర్మాణం కోసం తవ్విన గుంతల్లో నీరు చేరి దోమలు పెరుగుతున్నాయి.
– శివసుబ్రమణ్యం, 54వ డివిజన్
జ : డ్రెయినేజీ నిర్మాణం కోసం తీసిన గుంతల్లో నీటిని తొలగిస్తాం. పైపులైన్ల మరమ్మతు త్వరగా పూర్తిచేయిస్తాం. ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందిని పంపించి సమస్యను పరిష్కరిస్తాం.
● ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగాయి. దీంతో మురుగు నీరు నిలిచి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి.
– లక్ష్మీనారాయణ, పుష్ప, జయనగర్ కాలనీ / కిషన్, 20వ డివిజన్
జ : ఖాళీ స్థలాలతో ఎదురయ్యే సమస్యలు చాలావరకు పరిష్కరించగలిగాం. ఇంకా కొన్ని చోట్ల యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎక్కడైనా ఖాళీ స్థలం ఉండి చెత్త పేరుకుపోతే యజమాని ఫోన్ నెంబర్ మా సిబ్బందికి ఇవ్వండి. వారికి జరిమానా విధించి చర్యలు తీసుకుంటాం.
● ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో గేదెలు కట్టేస్తుండడంతో దోమలు, దుర్వాసనతో ఇబ్బంది ఎదురవుతోంది.
– లింగానాయక్, మాణిక్యనగర్, చెరువుబజార్
జ : శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను పంపించి సమస్య పరిశీలిస్తాం. మా సిబ్బంది వచ్చినప్పుడు సమస్య ఉన్న ప్రాంతాలను చూపించండి.
● విద్యాసంస్థల వ్యర్థాలు బయట వేస్తున్నారు. దీంతో దోమలు పెరగడమే కాక కుక్కల బెడద ఎక్కువైంది.
– కిషన్, కవిరాజ్‌నగర్, రోడ్డు నంబర్–6
జ : వ్యర్థాలను బయటకు వేసే వారికి జరిమానా విధిస్తాం. తొలుత నిర్వాహకులకు చెత్త బయట వేయొద్దని సూచిస్తాం. అయినా మారకపోతే మా దృష్టికి తీసుకరండి.
● డ్రెయినేజీలు లేక వర్షపునీరు, మురుగు నీరు ఖాళీ స్థలాల్లోకి చేరుతుంది.
– పి.ఏసు, శ్రీనివాసనగర్ / వాహబ్, 21వ డివిజన్ / లింగానయాక్, బల్లేపల్లి
జ : డ్రెయినేజీలు లేని ప్రాంతాల్లో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. ఇప్పటివరకై తే నిలిచిన నీటిని తీయిస్తాం.
● పన్నులు చెల్లిస్తున్నా రోడ్లు, డ్రెయిన్లు లేవు. మమ్ముల్ని ఎవరూ పట్టించుకోక ఖమ్మంలోనే ఉన్నామా అని అనిపిస్తోంది.
– భరత్, 1వ డివిజన్ / మంగీలాల్,
1వ డివిజన్, విద్యానగర్
జ : సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. డ్రెయిన్లు లేని చోట కచ్చా కాల్వల ద్వారా మురుగు బయటకు వెళ్లేందుకు చర్యలు తీసుకుంటాం.
● వీధి లైట్లు లేక ఇబ్బంది పడుతున్నాం.
– జీ.ఎస్, మంచికంటి నగర్
జ : విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో లైట్లు ఏర్పాటు చేయలేకపోయారు. ప్రత్యామ్నాయంగా లైట్ల ఏర్పాటుపై దృష్టి సారిస్తాం.
● వీధి కుక్కల బెడద కారణంగా రాత్రి పూట నిద్ర ఉండడం లేదు. – అశోక్, ఇందిరానగర్
జ : కుక్కలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలించే హక్కు కేఎంసీకి లేదు. కుక్కల సంతతి పెరగకుండా ఆపరేపన్లు చేయిస్తున్నాం. అలాగే, ప్రతీ కుక్కకు వ్యాక్సిన్ వేయిస్తున్నాం. మీ ప్రాంతంలో కుక్కల సమస్య పరిష్కారానికి వీలైన చర్యలు తీసుకుంటాం.
తీయించకపోతే యజమానికి జరిమానా
మురుగునీరు నిలిచినా, చెత్త తీసుకెళ్లకపోయినా ఫిర్యాదు చేయండి
డ్రెయిన్లు లేని ప్రాంతాల్లో కచ్చా కాల్వలు తవ్విస్తాం
‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో కేఎంసీ డిప్యూటీ కమిషనర్ మల్లీశ్వరి
