
మున్నేరు వద్ద నిమజ్జనానికి సిద్ధంగా ఉన్న వినాయకుడి ప్రతిమలు
జిల్లా కేంద్రంలో కనుల పండువగా శోభాయాత్ర
● మున్నేరులో గణపతి ప్రతిమల నిమజ్జనం ● హాజరైన మంత్రి పువ్వాడ, ఎంపీ నామా ● ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ గౌతమ్, సీపీ వారియర్
ఖమ్మంగాంధీచౌక్: తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథునికి భక్తులు బుధవారం అంగరంగ వైభవంగా వీడ్కోలు పలికారు. కులమతాలకు అతీతంగా గణపతిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. జిల్లా వ్యాప్తంగా 3,500 మండపాలను ఏర్పాటుచేయగా, చివరి రోజు ప్రత్యేక పూజల అనంతరం వాహనాల్లో భక్తులు నిమజ్జనా నికి బయలుదేరారు. ఈసందర్భంగా బ్యాండ్ మేళాలు, కోలాటాలు, డీజే శబ్దాల నడుమ గణనాథుడిని వాహనాలపై ఉంచి ఊరేగింపు నిర్వహించారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తీసుకొస్తున్న వినాయక ప్రతిమలకు గాంధీచౌక్‌లో స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యాన స్వాగతం పలికి నిమజ్జనానికి పంపించారు. ఈసందర్భంగా పలుచోట్ల భక్తులు, ఉత్సవ కమిటీల బాధ్యులు అన్నదానం, తాగునీరు పంపిణీ చేశారు. స్వచ్ఛంద సంస్థలు, ముస్లింల నేతృత్వాన కూడా తాగునీరు సరఫరా చేశారు. ఇక ఖమ్మంలోని కాల్వొడ్డు, ప్రకాష్‌నగర్‌ల వద్ద మున్నేరులో విగ్రహాలను క్రెయిన్ల సాయంతో నిమజ్జనం చేయగా బుధవారం అర్ధరాత్రి వరకు కూడా కార్యక్రమం కొనసాగింది.
ఇకపై మట్టి విగ్రహాలతోనే ఉత్సవాలు
జలాశయాల్లో నీరు కలుషితం కాకుండా వచ్చే ఏడాది నుంచి వంద శాతం మట్టి విగ్రహాలతో వినాయక ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. ఖమ్మం గాంధీచౌక్‌లో స్తంభాద్రి ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్నేరు వెంట రూ.690 కోట్లతో రక్షణ గోడలు, రూ.180 కోట్లతో కాల్వొడ్డు వద్ద తీగల వంతెన, మరో మూడు చెక్ డ్యామ్‌లు నిర్మిస్తున్న నేపథ్యాన నీరు కలుషితం కాకుండా భక్తులందరూ మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని కోరారు. జిల్లా యంత్రాంగం, స్తంభాద్రి ఉత్సవ సమితి ఉత్సవాలు విజయవంతంగా ముగిసేలా కృషి చేశారని అభినందించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడగా కలెక్టర్ వీ.పీ.గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ ఆదర్శ్ ఉరభి, సుడా, మార్కెట్ చైర్మన్లు విజయ్‌కుమార్, దోరేపల్లి శ్వేత, స్తంభాద్రి ఉత్సవ సమితి అధ్యక్షుడు వినోద్ లాహోటితో పాటు కీసర జయపాల్‌రెడ్డి, గెంట్యాల విద్యాసాగర్, వెంపటి లక్ష్మీనారాయణ, కన్నం ప్రసన్న కృష్ణ, అల్లిక అంజయ్య, మూలగుండ్ల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఆతర్వాత మంత్రి పువ్వాడ మున్నేరు వద్దకు వెళ్లి వినాయక నిమజ్జనాన్ని ప్రారంభించారు.
శోభాయాత్రలో
డప్పు వాయిస్తున్న యువతి
