
సదస్సులో మాట్లాడుతున్న ఆజాద్
ఖమ్మంరాపర్తినగర్: తెలంగాణ ప్రజలను మోసం చేసేలా సెప్టెంబర్ 17ను సమైక్యత, విమోచనం, విలీనం పేరుతో నిర్వహిస్తున్న పార్టీలు చరిత్రను వక్రీకరించే కుట్రలు చేస్తున్నాయని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ విమర్శించారు. అయితే, ఎవరెన్ని కుట్రలు చేసినా కచ్చితంగా విద్రోహ దినమేనని తెలిపారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘తెలంగాణలో సెప్టెంబర్ 17న ఏం జరిగింది?’అంశంపై శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టుల నాయకత్వాన ప్రజలు రజాకార్లను మట్టి కరిపించారని తెలిపారు. అయితే, ప్రజలను విభజించి పాలించడానికి నాటి కాంగ్రెస్ నుంచి నేటి బీజేపీ వరకు రకరకాల కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కాగా, తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మతోన్మాదులు విమోచన దినం పేరిట చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ ఈనెల 17న విద్రోహ దినంగానే పాటించాలని ఆజాద్ కోరారు. సదస్సులో పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్‌తో పాటు నాయకులు సతీశ్, లక్ష్మణ్, కరుణ్, శివ, సతీశ్, నాయకులు శ్రీను, చందు పాల్గొన్నారు.
పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆజాద్