
వంటషెడ్ వద్ద విద్యార్థులతో ప్రజాప్రతినిధులు
తల్లాడ: మండలంలోని అన్నారుగూడెం జెడ్పీహెచ్‌ఎస్‌లో వంట షెడ్డు నిర్మాణానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సీతారామపట్నం గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ వాసిరెడ్డి దయానంద్ రూ.50 వేలు విరాళం అందజేశారు. పాఠశాలలో వంట షెడ్డు లేక ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించిన ఆయన బోడేపూడి విజ్ఞాన కేంద్రం సౌజన్యంతో విరాళం అందజేయగా నిర్మాణం పూర్తయింది. శనివారం షెడ్డును ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ మారెళ్ల మమత ప్రారంబించారు. కార్యక్రమంలో ఎంఈఓ దామోదరప్రసాద్, హెచ్‌ఎం బి.రమేశ్‌తో పాటు మాదినేని రమేశ్, ఎంఎం రాజకుమారి, పులి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
1,254 కార్లతో విజయభేరికి ‘పొంగులేటి’ అనుచరులు
ఖమ్మంమయూరిసెంటర్: హైదరాబాద్‌లో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యాన జరగనున్న విజయభేరి సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు భారీగా తరలివెళ్లనున్నారు. సుమారు 1,254 కార్లలో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని నియోజకవర్గాల నుంచి ఉదయం 10 గంటలకు నాయకులు ఖమ్మం చేరుకోనుండగా, ఇక్కడి నుంచి ర్యాలీగా హైదరాబాద్ బయలుదేరతారని చెప్పారు.
ఉచిత శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యాన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పరిధిలోని గిరిజన నిరుద్యోగ మహిళలకు రెండు నెలలు ఉచితంగా ఐటీఈఎస్, వెబ్ మొబైల్ శిక్షణ ఇవ్వనున్నట్లు పీఓ ప్రతీక్‌జైన్ తెలిపారు. ఈ శిక్షణకు ఇంటర్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై, 18–25 ఏళ్ల వయ స్సు కలిగిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ జిరాక్స్‌తో ఈ నెల 20న ఉదయం 9 గంటలకు తమ కార్యాలయంలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు.
వెబ్‌సైట్ నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం
ఐటీడీఏలో వెబ్‌సైట్ నిర్వహణకు వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఓ తెలిపారు. ఆసక్తి గలవారు కార్యాలయ స్టాటిస్టికల్ విభాగంలో సంప్రదించాలని పేర్కొన్నారు.