వివాహితకు గాయాలు
కూసుమంచి: ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై శనివారం నాయకన్‌గూడెం వద్ద కారు ప్రమాదవశాత్తు బోల్తా పడగా అందులోని వివాహితకు గాయాలయ్యాయి. కూసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామానికి చెందిన మహిళ (25) కారులో తన భర్త, చిన్నారితో సూ ర్యాపేట నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె గాయపడగా ఒడిలో ఉన్న చిన్నారి, కారు నడుపుతున్న భర్త క్షేమంగా బయటపడ్డారు. హైవే సిబ్బంది కారు ను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
చోరీ కేసుల్లో నిందితుడిపై పీడీ యాక్ట్
ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో ద్విచక్రవాహనాలను చోరీ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ విష్ణు ఎస్.వారియర్ తెలిపారు. కూసుమంచి మండలం ఎర్రగడ్డతండాకు చెందిన భూక్యా తిరుపతిపై ఖమ్మం వన్‌టౌన్, టూటౌన్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆరు చోరీ కేసులు నమోదయ్యాయి. తిరుపతి నుంచి 13 బైక్‌లు రికవరీ చేశారు. గతంలో జైలుశిక్ష అనుభవించినా తనలో మార్పు రాలేదు. మళ్లీ ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతుండడంతో పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. కాగా, నిందితుడిని టూటౌన్ సీఐ కుమారస్వామి ఆధ్వర్యాన శనివారం చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించినట్లు వెల్లడించారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
తిరుమలాయపాలెం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటనపై శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పిండిప్రోలుకు చెందిన రొయ్యల కోటయ్య (51) ఈ నెల 11న రాత్రి సమయంలో గేదెను తీసుకుని పొలం నుంచి ఇంటికి వస్తున్నాడు. పిండిప్రోలు సమీపంలోకి రాగానే ఖమ్మం నుంచి మరిపెడ వైపు వెళ్తున్న బొలేరో వాహనం అతివేగంగా వెళ్లి ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో కోటయ్యతో పాటు గేదెకు తీవ్ర గాయాలు కాగా కోటయ్యను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య సుగుణమ్మ, కుమార్తె సరిత ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.