
మాట్లాడుతున్న సీపీ విష్ణు ఎస్.వారియర్
ఖమ్మంక్రైం: వినాయక నవరాత్రి ఉత్సవాలతో పాటు నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యేలా నిర్వాహకులు సహకరించాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ సూచించారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఖమ్మం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్‌లో శనివారం స్తంభాద్రి గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, డీజే ఏర్పాటుకు అనుమతి లేదనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. అంతేకాక పోలీసులు, కేఎంసీ, అగ్ని మాపకశాఖ, నీటిపారుదల శాఖ, వైద్యశాఖ, విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులకు సహకరిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఎక్కడ రాకపోకలకు ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమతి లేకుండా ప్రైవేట్ స్థలాల్లో విగ్రహాలు ప్రతిష్ఠించొద్దని సూచించారు. కాగా, స్తంభాద్రి ఉత్సవ కమిటీ సభ్యులు పలు సమస్యలను సీపీ దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు, ఏసీపీలు హరికృష్ణ, బస్వారెడ్డి, గణేశ్, సారంగపాణి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ మల్లేశ్వరి, స్తంభాద్రి ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు విద్యాసాగర్, వేల్పుల సుధాకర్, రామారావు, కన్వీనర్ ప్రసన్న, ఆర్గనైజింగ్ కార్యదర్శి అల్లిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
సమన్వయ సమావేశంలో సీపీ వారియర్