
సభలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం
●కమ్యూనిస్టులు ముందుండి నడిపించారు.. ●చరిత్రను వక్రీకరించేందుకు యత్నిస్తున్న బీజేపీ ●సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఖమ్మంవన్‌టౌన్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఆద్యురాలు చాకలి ఐలమ్మ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభద్రం వెల్లడించారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శనివారం వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో తమ్మినేని మాట్లాడుతూ నిజాం పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. దీంతో ప్రపంచంలోనే గొప్ప సాయుధ పోరాటాన్ని నిర్వహించిన కమ్యూనిస్టులు ప్రజలకు విముక్తి కల్పించారన్నారు. జిల్లాలోని పిండిప్రోలు, ఎం వెంకటాయపాలెం, తెల్దారుపల్లి, బొదులబండ, జల్లేపల్లి తదితర ప్రాంతాల్లో సాయుధ దళాలుగా ఏర్పడి పోరాడారని వివరించారు. అయితే, బీజేపీ నేతలు మాత్రం చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాయుధపోరాటంతో అమిత్‌షాకు ఏం సంబంధం ఉంద చెప్పాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు పోతినేని సుదర్శన్, ఎర్రా శ్రీకాంత్, బండి రమేష్, బండి పద్మ, సుబ్బారావు, కోటేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, సంగబత్తుల నవీన్‌రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
అడ్డుకుని తీరుతాం..
కొణిజర్ల: బీజేపీది అసమాన ధర్మమైతే.. కమ్యూనిస్టు పార్టీలది సమధర్మమని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఇండియా కూటమి అడ్డుకుని తీరుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కొణిజర్ల మండలం చిన్నగోపతిలో శనివారం జరిగిన సీపీఎం నేత లింగాల భూషణం సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమి అంటేనే బీజేపీకి వణుకు పుడుతోందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడగా, నాయకులు బొంతు రాంబాబు, బుర్రి గోపయ్య, బోయినపల్లి శ్రీనివాసరావు, కొప్పుల కృష్ణయ్య, బుగ్గవీటి సరళ, మాదినేని రమేశ్, తాళ్లపల్లి కృష్ణ, మేరుగు సత్యనారాయణ, మండల నాయకులు చెరుకుమల్లి కుటుంబరావు, మేరుగు రమణ, యోహాన్, అన్నారపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.