‘మట్టి’ మేలు తలపెట్టాలని.. | - | Sakshi
Sakshi News home page

‘మట్టి’ మేలు తలపెట్టాలని..

Sep 17 2023 6:12 AM | Updated on Sep 17 2023 6:12 AM

విక్రయానికి సిద్ధంగా ఉన్న మట్టి వినాయక విగ్రహాలు - Sakshi

విక్రయానికి సిద్ధంగా ఉన్న మట్టి వినాయక విగ్రహాలు

● పర్యావరణ రక్షణకు మట్టి వినాయక విగ్రహాల విక్రయాలు ● ఉత్సవ కమిటీలకు అందుబాటులో ప్రతిమలు ● పర్యావరణ పరిరక్షణ కోసమేనంటున్న నిర్వాహకులు ● జలాచరాలకు ప్రయోజనం కలిగేలా ‘సీడ్‌ గణేష్‌’ కూడా..

ఖమ్మంగాంధీచౌక్‌: వినాయక ఉత్సవాల సందర్భంగా ఏటేటా నిర్వాహకులు పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసిన వినాయక వ్రిహాలతో ఎదురయ్యే అనర్థాలపై అవగాహన ఉండడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారుచేసిన విగ్రహాలన నిమజ్జనం చేయడం ద్వారా జలాశయాలు కలుషితమవుతున్నాయి. అలాగే, పర్యావరణం దెబ్బతింటుంది. జలాశయాల్లోని జలచరాల మనుగడ దెబ్బతింటోంది. ఈ నేపథ్యాన మట్టి విగ్రహాల ప్రతిష్ఠాపనకు చొరవ తీసుకుంటున్నారు.

క్రమంగా ౖపైపెకి..

జిల్లాలో ఏటేటా మట్టి విగ్రహాలతో ఉత్సవాలను జరుపుకునే సంస్కృతి పెరుగుతోంది. ఎనిమిదేళ్లుగా జిల్లాలో ప్రచారం చేస్తుండగా.. ఖమ్మం శ్రీ స్తంభాద్రి సేవా సమితి, మరికొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహంతో తయారీదారులు మట్టి విగ్రహాలను విక్రయిస్తున్నారు. 2015లో ఎంత ప్రచారం చేసినప్పటికీ కేవలం పది మట్టి విగ్రహాలను మాత్రమే విక్రయించగలిగారు. ఆ తర్వాత నుంచి ఈ సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 1,100 మట్టి విగ్రహాలకు, ఖమ్మంలో 30 విగ్రహాలకు ఆర్డర్లు వచ్చాయంటే పరిస్థితిలో మార్పును అర్థం చేసుకోవచ్చు. భారీ స్థాయిలో మట్టి విగ్రహాలను హైదరాబాద్‌, సూర్యాపేట, కోల్‌కతాకు చెందిన నిపుణులు తయారు చేసి తీసుకొచ్చి ఇల్లెందు క్రాస్‌ రోడ్‌, బైపాస్‌ రోడ్‌ కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌ సమీపాన విక్రయిస్తున్నారు. సైజ్‌ ఆధారంగా రూ.12 వేల నుంచి రూ.30 వేల వరకు ధర పలుకుతోంది.

విత్తన గణేశ్‌లు..

మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాల్లో కూడా నవ ధాన్యాలను కలుపుతున్నారు. చేపలు, జలచరాలకు ఆహారంగా ఉపయోగపడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకొందరు వేప, ఇతర విత్తనాలు కలుపుతున్నారు. తద్వారా వినాయక చవితి పూర్తయ్యాక అందులోని విత్తనాన్ని ఇంట్లో నాటితే మొక్కలను పెంచినట్లవుతోంది.

నిర్వాహకులను ప్రోత్సహిస్తున్నాం

మట్టి విగ్రహాల తయారీ, ప్రతిష్ఠాపనను ప్రోత్సహిస్తున్నాం. పీఓపీతో చేసే విగ్రహాల వల్ల ఇబ్బందులు, మట్టి విగ్రహాలతో కలిగే ప్రయోజనాలను వివరిస్తుండగా విగ్రహాల సంఖ్య పెరుగుతోంది. ఖమ్మంలోనూ విగ్రహాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. – వినోద్‌ లాహోటీ,

స్తంభాద్రి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు

ప్రాధాన్యం పెరుగుతోంది..

పలువురు మండప నిర్వాహకులు మట్టి విగ్రహాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. పీఓపీతో చేసే విగ్రహాలతో ఎదురయ్యే సమస్యలపై అవగాహన వచ్చింది. కోల్‌కత్తాలో గంగా నది మట్టి తీసుకొచ్చి చేసే విగ్రహాలను తెలంగాణ అంతటా విక్రయిస్తున్నాం. –దండి దిలీప్‌కుమార్‌,

మట్టి విగ్రహాల తయారీదారుడు

ప్రత్యామ్నాయంగా మట్టి విగ్రహాలు

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలతో అనర్థాలు చోటు చేసుకుంటుండటంతో ప్రత్యామ్నాయంగా మట్టి విగ్రహాలను పర్యావరణ వేత్తలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ విషయమై పర్యావరణవేత్తలు కొంతకాలంగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలతో కలిగే నష్టాలు, మట్టి విగ్రహాలతో కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్తుండగా మంచి ఫలితాలు వస్తున్నాయి. అంతేకాకుండా మట్టి విగ్రగహాలను తయారుచేసి విక్రయించే వారిని సైతం ప్రోత్సహిస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణకే..

పీఓపీ, ప్లాస్టిక్‌ పదార్థాలతో విగ్రహాలను నిమజ్జనం చేస్తే చెరువుల్లో నీరు కలుషితమవుతోంది. జీవకోటికి ముప్పు వస్తోంది. అందుకే వాడవాడన జరుపుకునే వినాయక ఉత్సవాల్లో మట్టి విగ్రహాలు వినియోగించాలని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్‌ కడవెండి వేణుగోపాల్‌,

పర్యావరణ వేత్త, ఖమ్మం

అందుబాటులో విగ్రహాలు

వినాయక ఉత్సవ కమిటీలకు అందుబాటులో ఉండేలా మట్టి విగ్రహాలను తీసుకొచ్చాం. తయారీ యూనిట్‌ ఖమ్మంలోనే ఏర్పాటు చేయించాం. కోల్‌కత్తా కళాకారులు సూర్యాపేట, హైదరాబాద్‌లో చేసిన విగ్రహాలను తెప్పించి తయారీ ఖర్చుకే విక్రయిస్తున్నాం. –డౌలే సాయికిరణ్‌,

స్తంభాద్రి ఉత్సవ కమిటీ ప్రతినిధి

1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement