ఉమ్మడి ఖమ్మం జిల్లాపై రాజకీయ పార్టీల ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై రాజకీయ పార్టీల ఫోకస్‌

May 27 2023 1:28 AM | Updated on May 27 2023 1:45 PM

- - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలన్నీ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇక్కడ అత్యధిక స్థానాలు కై వసం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తుండగా.. కమ్యూనిస్టు పార్టీలు సైతం అదే ప్రయత్నాల్లో ఉన్నాయి. గతంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ, కాంగ్రెస్‌ నిరుద్యోగ నిరసన ప్రదర్శన ఇక్కడే నిర్వహించగా.. బీజేపీ ఆధ్వర్యాన శనివారం నిరుద్యోగ మార్చ్‌ ఏర్పాటుచేశారు.

కార్యక్షేత్రంలో కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఉమ్మడి జిల్లాలో కార్యక్రమాల జోరు పెంచిన నేపథ్యాన గతంలో స్తబ్దుగా ఉన్న కేడర్‌లో కదలిక వచ్చింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర స్ఫూర్తితో ఉమ్మడి జిల్లాలో హాథ్‌సే హాథ్‌ జోడో యాత్ర నిర్వహించారు. నేతలందరూ తమ పరిధిలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపారు. ఇదేక్రమంలో ఏప్రిల్‌ 24న కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. గత రెండు ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలను కై వసం చేసుకున్నందున ఈసారి ఇంకా ఎక్కువ స్థానాలను గెలుచుకునేలా నేతలు కేడర్‌కు సూచనలు చేశారు.

కమలం.. పట్టుకు యత్నం
బీజేపీ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఇతర నేతలు పలుసార్లు వచ్చివెళ్లారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను చేర్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గతంలోనూ పలుమార్లు జిల్లాకు వచ్చివెళ్లగా.. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఖమ్మం వేదికగా శనివారం నిరుద్యోగ మార్చ్‌ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంజయ్‌తో పాటు పలువురు రాష్ట్రస్థాయి నేతలు పాల్గొననున్నారు.

చుట్టేస్తున్న కమ్యూనిస్టులు
సీపీఎం, సీపీఐ నేతలు సైతం ఉమ్మ డి ఖమ్మం జిల్లాను చుట్టేస్తున్నాయి. ఇరు పార్టీల అగ్రనేతలు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు ఉమ్మడి జిల్లా వాసులే కావడంతో ఎన్నికల్లో ఇక్కడి నుంచి కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం కలిసొచ్చే పార్టీలతో పొత్తులకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో ఇరువురు నేతలు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ పొత్తు ఉన్నా, లేకపోయినా తాము పోటీలో ఉంటామనే సంకేతాలు ఇస్తున్నారు. కాగా, వచ్చేనెల 4న కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యాన ప్రజాగర్జన సభను భారీగా నిర్వహించేలా నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

బీఆర్‌ఎస్‌.. బీ అలర్ట్‌

ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు సాధించాలనే పట్టుదలతో బీఆర్‌ఎస్‌ ఉంది. 2014, 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా జిల్లాలో ఒక్కో సీటే దక్కించుకోవడం గమనార్హం.  ఆ తర్వాత నెగ్గిన వాళ్లలో కొందరు బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో  ఈసారి ఎలాగైనా.. నేరుగా.. అత్యధిక స్థానాలను కై వసం చేసుకోవాలనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. 

పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు జిల్లాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా పరిస్థితి అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 18న ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ విజయవంతం కావడం శ్రేణుల్లో జోష్‌ నింపినట్లయింది. ఆ తర్వాత అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. 

ఇవేగాక.. తరచుగా మంత్రులు పర్యటిస్తూ కేడర్‌లో ఉత్తేజం నింపడంతోపాటు ప్రజలకు ప్రభుత్వ పథకాలను తెలియజేసేలా కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement