
సమ్మేళనంలో మాట్లాడుతున్న శ్రీనివాసరెడ్డి
● రూ.కోట్ల హామీలు ఏమయ్యాయి ? ● రామయ్య హుండీలో రూపాయి కూడా వేయని గొప్ప భక్తుడు కేసీఆర్.. ● సమ్మేళనంలో మాజీ ఎంపీ పొంగులేటి
భద్రాచలం: భద్రాద్రి రామయ్యతో పాటు ఈ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ అడుగడుగునా ద్రోహం చేశారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శనివారం నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈమేరకు పొంగులేటికి బ్రిడ్జి సెంటర్ వద్ద అభిమానులు, అనుచరులు ఘనంగా స్వాగతం పలకగా, అక్కడి నుంచి కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన సభలో పొంగులేటి మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక భద్రాచలంలో ఎనిమిది సార్లు శ్రీరామనవమి వేడుకలు జరిగితే ఒక్కసారే హాజరయ్యారని, భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు, గోదావరి వరద బాధితులకు రూ.1000 కోట్లు ప్రకటించి రూపాయి కూ డా విడుదల చేయలేదని విమర్శించారు. రామయ్య హుండీలో కనీసం రూపాయి కూడా వేయని గొప్ప భక్తుడని ఎద్దేవా చేశారు. దివంగత నేత వైఎస్సార్ ఇళ్లు నిర్మించి ఇస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఇప్పటికీ పూజిస్తున్నారని, ప్రజలకు అలాంటి పాలన అందించాలే తప్ప అమలు చేయని హామీలతో మోసం చేయవద్దని హితవు పలికారు. నీళ్లు, నిధులు, నియామకాలతో సాధించుకున్న తెలంగాణలో అవన్నీ కల్వకుంట్ల కుటుంబానికే చేరుతున్నాయని విమర్శించారు. కలిసి వచ్చే మిత్రులతో ముందుకు సాగుతామని, జెండా ఏదైనా సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే అజెండా అని స్పష్టం చేశారు. నాయకులు తెల్లం వెంకట్రావ్, పినపాక మాజీ ఎమ్మేల్యే పాయం వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వ విజయ్‌బాబు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవితో పాటు జారే ఆదినారాయణ, విజయాబాయి, మార్క్‌ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.