
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు శని వారం నాలుగు రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీవారికి సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేకం చేశాక, స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో కల్యాణోత్సవాని కి ముస్తాబు చేశారు. అనంతరం నిత్య కల్యాణాన్ని అర్చకులు కురవి వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి నిర్వహించగా, ఉత్సవ మూర్తులను గజ వాహనంపై గిరిప్రదక్షిణ చేయించారు. ఈఓ కె.జగన్మోహన్‌రావు, ఉద్యోగులు శ్రీనివాస్, విజయకుమారి, అర్చకులు ఉప్పల విజయదేవశర్మ, మురళీమోహన్‌శర్మ పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు ముమ్మరంగా గస్తీ
● పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్
కూసుమంచి: రాత్రి వేళ గస్తీ ముమ్మరం చేయడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట పడుతుందని పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్ తెలిపారు. కూసుమంచి పోలీస్‌స్టేషన్‌ను శనివా రం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించారు. అలాగే, ఫిర్యాదుల నమోదు, పెండింగ్ కేసులు, విచారణ, ఫంక్షనల్ వర్టికల్స్‌పై సమీక్షించారు. సిబ్బంది అత్యవసర సమయాల్లో విధులకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని, అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. పాత నేరస్తుల నివాసాలు, వారి కదలికలను గుర్తించేలా చేస్తున్న జియో ట్యాగింగ్‌ను ఆన్‌లైన్‌లో సీపీ పరిశీలించారు. ఈ తనిఖీల్లో సీఐ జితేందర్‌రెడ్డి, ఎస్సై రమేష్‌కుమార్ పాల్గొన్నారు.
సమానత్వం
ఇంటి నుంచే రావాలి..
ఖమ్మంలీగల్: ఆడ, మగ సమానత్వం ఇంటి నుంచే ప్రారంభం కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నా రు. అంతర్జాతీయ భ్రూణ హత్యల వ్యతిరేక ది నం సందర్భంగా శనివారం పారా లీగల్ వలంటీర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయసేవాసంస్థ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ సదస్సులో జిల్లా జడ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రకృతిలో ఆడ, మగ ఇద్దరూ సమానమేనని గుర్తించాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో ఆడపిల్ల కంటే మగపిల్ల లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడం సరికాదన్నారు. ఆడబిడ్డ పుడితే కట్నం ఇవ్వాల్సి వస్తుందని భయంతో భ్రూణహత్యలకు పాల్పడుతున్నారని.. అందుకోసం వరకట్నాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. న్యాయసేవాసంస్థ కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా, న్యాయవాదులు పాల్గొన్నారు.
28న జెడ్పీ సమావేశం
ఖమ్మం సహకారనగర్: జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు సీఈ వీ.వీ.అప్పారావు తెలిపారు. ఈనెల 28న ఉదయం 10గంటలకు జెడ్పీ హాల్‌లో చైర్మన్ లింగాల కమల్‌రాజ్ అధ్యక్షతన సమావేశం మొదలవుతుందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలపై చర్చ జరగనున్న ఈ సమావేశానికి జెడ్పీటీసీలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, అధికారులు హాజరుకావాలని సూచించారు.


స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులతో అర్చకులు