బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ ఖాయం..

సభలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ, వేదికపై ఎంపీ నామా, ఎమ్మెల్సీ మధు తదితరులు - Sakshi

మధిర: రాబోయే ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వాన బీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగించి హ్యాట్రిక్‌ సాధించడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోనూ వామపక్షాలతో కలిసి పదికి పది సీట్లను గెలుచుకుంటామన్నారు. మధిరలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి స్థానిక టీవీఎం పాఠశాలలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోగా.. కేసీఆర్‌ స్వయంగా పరిశీలించి పంట నష్టపరిహారాన్ని ప్రకటించారని తెలిపారు. కేసీఆర్‌ను గద్దె దించుతాం అని చెబుతున్న కొందరి తీరు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఉందని పొంగులేటిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్టీలో ఉండి పార్టీ అభ్యర్థులను గెలిపించకుండా ద్రోహం చేశారని పేర్కొన్నారు. కాగా, ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యుడిగా మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలన డిమాండ్‌ చేస్తున్న బీజేపీ నేతలు.. ఆ ఘటనతో మంత్రికి ఏం సంబంధమో చెప్పాలని ప్రశ్నించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడు తూ తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకా లు దేశంలో మరెక్కడా లేవని అన్నారు. ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జెడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ తనకు గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ బీ ఫాం ఇచ్చారే తప్ప ఎవరి దయాదాక్షిణ్యాలతో పోటీ చేయలేదని తెలిపారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ అకాల వర్షాలతో ఇక్కడి రైతులు ఇబ్బంది పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఆదిలా బాద్‌లో పాదయాత్ర చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్‌ మునుగోటి వెంకటేశ్వరరావు బీఆర్‌ఎస్‌లో చేరగా ఆయనకు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తాతా మధు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సమావేశంలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు, విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్లు మొండితోక లత, శీలం విద్యాలత, ఎంపీపీ లలిత, కౌన్సిలర్లు మల్లాది వాసు, సవిత, ధరావత్‌ మాధవి, బిక్కి అనిత, నాయకులు మొండితోక జయాకర్‌, శీలం వెంకటరెడ్డి బిక్కి కృష్ణప్రసాద్‌, కరివేద సుధాకర్‌, చిత్తారు నాగేశ్వరరావు, కనుమూరు వెంకటేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, ఇక్బాల్‌, గుర్రం రామారావు, అరిగే శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో మధిర అభివృద్ధి

మధిర: మున్సిపల్‌ ఎన్నికల సమయాన ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మధిరను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధి అంబారుపేటలో రూ.5.70 కోట్లతో నిర్మించిన ట్యాంక్‌ బండ్‌, రూ.4.50 కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్‌ను ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. అలాగే, రూ.2.08 కోట్ల ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు, సెంట్రల్‌ లైటింగ్‌, సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరానికి ధీటుగా మధిర పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు కూరగాయలు, పండ్లు, మాంసాహారం ఒకే చోట లభించేలా సమీకృత మార్కెట్‌, ఆహ్లాదంకోసం ట్యాంక్‌బండ్‌ నిర్మించామని తెలిపారు. తొలుత బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించి మంత్రికి స్వాగతం పలికారు. మున్సిపల్‌ కమిషనర్‌ రమాదేవి, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ రంజిత్‌కుమార్‌, తహసీల్దార్‌ రాజేష్‌, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్‌ చక్రవర్తి పాల్గొన్నారు.

వామపక్షాలతో కలిసి ఉమ్మడి జిల్లాలో పది సీట్లు సాధిస్తాం

రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

మధిరలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top