● దొడ్డబళ్లాపురంలో కిరాతక భర్త
దొడ్డబళ్లాపురం: భార్యను లాడ్జికి తీసికెళ్లిన భర్త ఆమెను గొంతు బిగించి హత్య చేసిన సంఘటన దొడ్డబళ్లాపురంలో జరిగింది. వివరాలు.. గౌరిబిదనూరు తాలూకా నగరగెరె గ్రామానికి చెందిన విద్య (23), నాలుగేళ్ల క్రితం ముదుగెరె నివాసి ఆనంద్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. విద్య ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో పని చేస్తోంది. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఆమె బెంగళూరులో పీజీ హాస్టల్‌లో ఉంటోంది. ఇటీవల ఆనంద్ తన భార్య కనబడడం లేదని దొడ్డబళ్లాపురం మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విద్యను తీసుకువచ్చిన పోలీసులు 20 రోజుల క్రితం ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి కలిపి పంపించేశారు. బుధవారం రాత్రి విద్యను తీసుకుని ఆనంద్ దొడ్డలో ఓ లాడ్జిలో దిగాడు. ఆమె ఐడీ కార్డ్‌తోనే గొంతు బిగించి హత్య చేసి మొబైల్‌ను తీసుకుని అర్ధరాత్రి వెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న ఆనంద్ కోసం గాలిస్తున్నారు.


